హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ బ్యాంకు అకౌంట్లలో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా జమ చేసింది. స్థానిక సంస్థలు కొత్తగా తీసిన ఎస్బీఐ అకౌంట్లకు మార్చి నెలకు సంబంధించిన నిధులను ట్రయల్ రన్ గా బుధవారం ట్రాన్స్ఫర్ చేసింది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ నిధులు పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో జమ కానున్నాయి.
భద్రాచలం జీపీకి రూ.4.63 లక్షలు
రాష్ట్రంలోని 12,516 గ్రామ పంచాయతీలకు మార్చి నెలకు సంబంధించి రూ.19,25,89,473 కేంద్రం జమ చేసింది. గ్రామ జనాభాను బట్టి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 వేల నుంచి రూ.4 లక్షల వరకు విడుదలయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం జీపీ ఖాతాలో రూ.4.63 లక్షలు, ఆసిఫాబాద్ జీపీ ఖాతాలో రూ.2.15 లక్షలు జమయ్యాయి. మరో 253 జీపీలకు మాత్రం టెక్నికల్ సమస్యల వల్ల నిధులు జమ కాలేదు. రాష్ట్రంలోని 32 జెడ్పీల అకౌంట్లకు రూ.13.58 కోట్లు, 539 మండల పరిషత్ అకౌంట్లకు రూ.25.49 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసింది. మండల పరిషత్‌లలో అత్యధికంగా ఖమ్మం రూరల్ మండలానికి రూ.9.96 లక్షలు, నాగర్ కర్నూల్ జిల్లా బినపల్లి మండల పరిషత్‌కు రూ.9.19 లక్షలు జమయ్యాయి. ట్రయల్ గానే మార్చి ఫండ్స్ జమ చేశారని, త్వరలోనే మిగతా నెలల నిధులన్నీ జమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్ర సర్కార్ నిధుల మళ్లింపునకు చెక్
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు రిలీజ్ చేస్తున్నప్పటికీ.. ఆ నిధులను రాష్ట్ర సర్కార్ ఇతర అవసరాలకు మళ్లిస్తోందన్న ఆరోపణలున్నాయి. అలా మళ్లించిన నిధులను ఆర్నెళ్లు, ఏడాది ఆలస్యంగా జీపీలకు సర్దుబాటు చేస్తుండడంతో సర్పంచ్ లు చేసిన పనులకు సకాలంలో బిల్లులు రావట్లేదు. దీంతో రాష్ట్ర సర్కార్ పెత్తనానికి కత్తెర వేసేందుకే కేంద్రం ఇలా జీపీల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా అన్ని జీపీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల పేరిట జాయింట్ అకౌంట్లను జులై నెలలోనే ఓపెన్ చేయించింది. డిజిటల్ కీ కోసం సర్పంచ్, ఉప సర్పంచ్ ల బయోమెట్రిక్ సైతం డీపీవోలు తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా అకౌంట్ల నిర్వహణ కొనసాగుతుండగా, ఇక మీదట పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్) ద్వారా కొనసాగనుంది. దీంతో అకౌంట్ల ఫ్రీజింగ్ సమస్య కూడా తలెత్తే చాన్స్ లేదని తెలిసింది. కేంద్రం తెచ్చిన కొత్త విధానంతో గ్రామాల్లో చేసిన పనులకు వెంటనే బిల్లులు పొందే అవకాశం ఉంది.
