
న్యూఢిల్లీ: వరదలు, కొండచరియలతో ప్రభావితమైన రాష్ట్రాలకు కేంద్రం రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది. అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద ఈ నిధులను కేంద్రం అందించింది. ఈ మేరకు గురువారం కేంద్రహోంమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. కేంద్రం అన్ని విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థిక సహాయం అందించడంతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ను మోహరించడం సహా లాజిస్టిక్స్ పరంగా సాయాన్ని అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు.
కేంద్ర హోంశాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వరద ప్రభావిత రాష్ట్రాలలో అత్యధికంగా ఉత్తరాఖండ్ కు రూ.455.60 కోట్లు, అత్యల్పంగా మిజోరాంకు రూ.22.8 కోట్ల నిధులను ఎస్డీఆర్ఎఫ్కింద కేంద్ర వాటాగా అందించినట్టు తెలిపింది. ఈ ఏడాది మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా అందించినట్టు పేర్కొంది.
రాంచీలో ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్
ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం రాంచీలో మొదలైంది. నాలుగు తూర్పు రాష్ట్రాలైన జార్ఖండ్, బిహార్, ఒడిశా, బెంగాల్ నుంచి 70 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జార్ఖండ్, ఒడిశా సీఎంలు హేమంత్ సోరెన్, మోహన్ చరణ్ మాఝి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. మీటింగ్ దృష్ట్యా రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.