
గచ్చిబౌలి, వెలుగు: క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఓ యువకుడు మాటల్లో పెట్టి ఆమె చేతికున్న బ్రాస్లెట్ మాయం చేశాడు. మరో స్నేహితుడితో కలిసి పరారయ్యాడు. స్నాచింగ్ ఘటనలో పాల్గొన్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ మీటింగ్ హాల్లో ఏసీపీ శ్రీధర్ వివరాలను వెల్లడించారు. మలక్‌పేట్ ఉస్మాన్పురాకు చెందిన బిక్కుల నరేందర్(24) ఈవెంట్ మేనేజ్మెంట్ఉద్యోగి. కాచిగూడ రాంకోటికి చెందిన ఆశీష్‌కుమార్(24) పెంపుడు జంతువుల గ్రూమింగ్ఉద్యోగం చేస్తున్నాడు.
వీరిద్దరూ స్నేహితులు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 15న వీరిద్దరు బైక్‌పై గచ్చిబౌలికి వచ్చారు. అమెజాన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎదుట క్యాబ్ కోసం వేచి ఉన్న ఐటీ ఉద్యోగిని రేలాగౌడ్ దగ్గరికి నరేందర్ వెళ్లాడు. ఉద్యోగం కోసమని అమెను మాటల్లో పెట్టాడు. ఆమె చేతికున్న 6 తులాల బంగారు బ్రాస్లెట్ను అపహరించి బైక్‌తో సిద్ధంగా ఉన్న అశీష్కుమార్తో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు.
గచ్చిబౌలి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం నరేందర్, అశీష్కుమార్ను అరెస్ట్ చేసి బ్రాస్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబిబుల్లాఖాన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరేశ్ పాల్గొన్నారు.