సంక్షేమం, అభివృద్ధే ప్రజాపాలన ధ్యేయం..అర్హులందరికీ అభయహస్తం పథకాలు: భట్టి విక్రమార్క

సంక్షేమం, అభివృద్ధే ప్రజాపాలన ధ్యేయం..అర్హులందరికీ అభయహస్తం పథకాలు: భట్టి విక్రమార్క
  • ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జెండా ఎగరేసిన డిప్యూటీ సీఎం

ఖమ్మం టౌన్, వెలుగు: పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన కొనసాగుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు, కూలీలు భూమి కోసం, భుక్తి కోసం భూపోరాటాలు చేసి, నిజాంప్రభుత్వ సాయుధ రజాకార్లను ఎదిరించారని, నిజాం సంస్థానాన్ని భారతదేశంలో భాగంగా చేసేందుకు ఎన్నో పోరాటాలు జరిగాయని, ఖమ్మం జిల్లాకు ఈ పోరాటాలలో ప్రముఖ పాత్ర ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేయడం ప్రారంభించిందన్నారు.

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025తో 2030 నాటికి లక్షా 98 వేల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసి లక్షా 14 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కొక్కటి రూ.200 కోట్ల చొప్పున ఖర్చుతో 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణం చేపట్టామన్నారు. 

మధిర, సత్తుపల్లి పట్టణాలలో రూ.34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆసుపత్రి, కల్లూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పెనుబల్లిలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. పాలేరు, సత్తుపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు, వైరాలో 100 పడకల ఆసుపత్రి, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్​నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు 
జరుగుతున్నాయని చెప్పారు.