
హైదరాబాద్: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాక్ మధ్య పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు డ్రోన్లు, మిస్సైళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ పరిణామాలతో పాక్, భారత్ మధ్య యుద్ధం మొదలైనట్లేనని అనుకుంటుండగా రంగంలోకి దిగిన అమెరికా ఇరు దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. దీంతో యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి.. సరిహద్దు దగ్గర ఇప్పుడిప్పుడే శాంతి వాతావరణం నెలకొంటుంది.
అయితే.. కాల్పులు విరమణ కుదిరినప్పటికీ.. పాక్ వక్ర బుద్ధి తెలిసిన భారత్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. భారత్‌పై పీకల దాకా విషం నింపుకుని ఉండే పాక్.. ప్రపంచ దేశాల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, భారత్ మెరుపు దాడులతో అతలాకూతులం కావడం వల్ల చేసేదేమి లేక సీజ్ ఫైర్‌కు అంగీకరించింది. పాక్ ఏ నిమిషమైనా తన జిత్తులమారి బుద్ధి చూపించే అవకాశం ఉండటంతో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే.. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణుల తయారీదారులను ఉత్పత్తిని వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా.. భారతదేశ క్షిపణి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న రక్షణ ఆయుధాల తయారీదారులను దేశంలో క్షిపణ నిల్వలను పెంచడానికి ఉత్పత్తిని పెంచి డెలివరీలు స్పీడప్ చేయాలని కోరింది.
హైదరాబాద్‌లో డీఆర్డీవో, భారత్ డైనమిక్స్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (KRAS), MTAR టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘు వంశీ, జెన్ టెక్నాలజీస్, SEC ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మిసైళ్ల తయారీ ఉత్పత్తిని పెంచి.. వేగంగా డెలివరీ చేయాలని కేంద్ర ఈ సంస్థలకు ప్రభుత్వం సూచించింది.
పాక్ తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో డెలివరీలను వేగవంతం చేయడానికి వీకెండ్లో కూడా పని చేయమని కేంద్ర ప్రభుత్వం కోరిందని ఆకాష్, బ్రహ్మోస్ మిసైళ్ల పరికరాలు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ప్రమోటర్ వెల్లడించారు. కాగా, 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడిలో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణులను హైదరాబాద్‌లోని కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (KRAS)లో తయారు చేసిన విషయం తెలిసిందే.