ఫిలిబెక్ వ్యాఖ్యలు వీసా నిబంధనల ఉల్లంఘనే: భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌లో వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వ వర్గాల ఫైర్

ఫిలిబెక్ వ్యాఖ్యలు వీసా నిబంధనల ఉల్లంఘనే: భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌లో వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వ వర్గాల ఫైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఇటలీ సోషలిస్టు నేత గియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు వీసా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. విదేశీ పౌరులు భారత్ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పేర్కొన్నాయి. ఈ-వీసా పోర్టల్ ద్వారా కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆయన, నిబంధనలకు విరుద్ధంగా దేశ రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు చేశారని ఆ వర్గాలు తెలిపాయి. 

కాగా, ఫిలిబెక్ ఇప్పటికే ఇటలీకి తిరిగి వెళ్లిపోగా.. భవిష్యత్తులో ఆయనపై వీసా ఆంక్షలు విధించే అంశంపై ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (పీఈఎస్) సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఫిలిబెక్, నవంబర్ 13, 14 తేదీల్లో జరిగిన భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి, ‘ఒక వ్యక్తి - ఒక ఓటు’సిద్ధాంతానికి ఆయన మద్దతు పలికారు.

అంతేకాకుండా, కాంగ్రెస్ నినాదమైన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ను ప్రస్తావిస్తూ.. భారత్‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాంగ్రెస్ పార్టీకి అంతర్జాతీయ మద్దతు అవసరమని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడటంతో పాటు పలువురు భారత రాజకీయ ప్రముఖుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఫిలిబెక్ వ్యాఖ్యలకు మెలోని పార్టీ కౌంటర్ 

ఇటలీ నేత ఫిలిబెక్ వ్యాఖ్యలను ఆ దేశ ప్రధాని జార్జియో మెలోని నేతృత్వంలోని ‘ఫోర్జా ఇటాలియా’పార్టీ నాయకురాలు డెబోరా బెర్గామిని తీవ్రంగా తప్పుబట్టారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను, ఎన్నికల ప్రక్రియను బలంగా సమర్థించారు. ‘‘97 కోట్ల మంది పౌరులకు ఓటు హక్కు కల్పించి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్న దేశానికి డెమోక్రసీపై పాఠాలు చెప్పడం ఎంతమాత్రం సరికాదు’’అని ఆమె ఘాటుగా బదులిచ్చారు. భారత్‌‌‌‌‌‌‌‌కు అత్యంత బలమైన, స్వతంత్రమైన ప్రజాస్వామ్య సంస్థలు, పటిష్టమైన న్యాయవ్యవస్థ ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.