- ఆరేండ్లలో మనం ఇచ్చింది 4,35,919
- రాష్ట్రానికి వచ్చింది 3,76,175
న్యూఢిల్లీ, వెలుగు: ఏటా పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నా.. తిరిగి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది తక్కువే! 2019 నుంచి 2025 వరకు ఆరేండ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి మొత్తం రూ. 4,35,919 కోట్లు పన్నుల రూపంలో సమకూరితే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 3, 76,175.19 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు రూ. 60 వేల కోట్లు లోటుగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెప్తున్నాయి. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో ఏటా రూ. లక్ష కోట్లకు పైగా పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే.. పన్నుల్లో వాటాలు, కేంద్ర పథకాలు, గ్రాంట్లు, ఇతర రూపాల్లో ఏటా మన రాష్ట్రానికి వచ్చింది సుమారు రూ. 67 వేల కోట్లే!
ఈ మేరకు సోమవారం లోక్ సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2019–2020 నుంచి 2024–25 వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయం, తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల బదలాయింపు వివరాలను ఎంపీ కోరారు.
ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ ద్వారా తెలంగాణ నుంచి కేంద్రానికి వస్తున్న ఆదాయం వివరాలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం నిధులు సహా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన కేటాయింపులపై ప్రశ్నించారు. అయితే.. ఈ ఆరేండ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది తక్కువే అని కేంద్ర మంత్రి సమాధానంలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ ఇచ్చింది ఇది..!
తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయం భారీగా ఉంటుంది. ముఖ్యంగా 2019–20లో రూ. 14 వేల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. 2024–25 నాటికి ఏకంగా రూ. 97 వేల కోట్లకు చేరాయి. ఈ ఐదేండ్లలో (2019 నుంచి 2025 వరకు) ప్రత్యక్ష పన్నులు, ఐజీఎస్టీ, సీజీఎస్టీ రూపంలో రూ. 4,35,919 కోట్లను తెలంగాణ ప్రజలు కేంద్రానికి చెల్లించారు.
ఇందులో 2019– 20లో రూ. 34,388 కోట్లు, 2020–21 లో రూ. 35,243 కోట్లు, 2021–22 లో రూ. 51,353 కోట్లు, 2022–23లో 63,908 కోట్లు, 2023–24 లో రూ. 1,17, 820 కోట్లు, ఈ ఏడాది 2024–25లో అత్యధికంగా రూ. 1,33, 208 కోట్లు సమకూరాయి. ఇందులో సింహభాగం ప్రత్యక్ష పన్నుల కింద రూ. 2, 74, 818.35 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 86, 695 కోట్లు, సీజీఎస్టీ కింద రూ. 74, 406 కోట్లు వెళ్లాయి.
తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చింది ఇది..!
కేంద్రానికి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న తెలంగాణకు పన్నుల్లో వాటాలు, ఇతర రూపాల్లో నిధుల తగ్గుదల కనిపిస్తున్నది. పన్నుల్లో వాటా, సెంట్రల్ సెక్టార్ స్కీంలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు, పైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, గ్రాంట్ లోన్లు/ ట్రాన్స్ ఫర్స్.. ఇలా మొత్తం ఏడు రూపాల్లో తెలంగాణకు రూ. 3, 76,175.19 కోట్లను కేంద్రం తిరిగి చెల్లించింది. మరీ ముఖ్యంగా 2023 నుంచి తెలంగాణకు నిధులు భారీగా తగ్గాయి.
2023–24 ఏడాదికి తెలంగాణ నుంచి కేంద్రానికి 1,17,820 కోట్లు ఆదాయం రాగా.. కేంద్రం నుంచి తెలంగాణకు 67,785 కోట్లు వచ్చింది. 2024 – 25 సంవత్సరానికి తెలంగాణ నుంచి కేంద్రానికి 1,33,208 కోట్లు ఆదాయం సమకూరగా.. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది 66,295.36 కోట్లు. అయితే... 2024–25 ఆర్థిక సంవత్సరం పన్నుల డేటా తాత్కాలికమైందిగా కేంద్రం పేర్కొంది. అలాగే తెలంగాణకు ఇచ్చిన నిధుల్లో.. రాష్ట్ర ట్రెజరీ, అమలు సంస్థకు ఇచ్చిన నిధులు కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది.
కేంద్రం చెప్పిన లెక్క ఇదీ!
ఏడాది వారీగా కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ కట్టింది (రూ.కోట్లలో) పన్నుల్లో వాటా, కేంద్ర స్కీంల కింద మనకు కేంద్రం ఇచ్చింది (రూ.కోట్లలో)
- 2019–20 34,388 48,872.95
- 2020–21 35,243 60,590.46
- 2021–22 51,353 62,562.05
- 2022–23 63,908 70,068.40
- 2023–24 1,17,820 67,785.97
- 2024–25 1,33,208 66,295.36
- మొత్తం 4,35,919 3,76,175.19
