
- పీఎం జన్మన్ స్కీమ్ కింద ఆర్థిక సాయం
- రాష్ట్రంలో 13వేల మంది గిరిజనులకు లబ్ధి
- ఒక్కొక్కరికి రూ.2.39 లక్షల నిధులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని గిరిజనులకు పీఎం జన్మన్ స్కీం కింద కేంద్రం ఆర్థిక సహాయం అందించనున్నది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో 13,151 మంది గిరిజనులకు ఇండ్లు లేవని కలెక్టర్లు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షల ఆర్థిక సాయం అందించనున్నదని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. ఈ స్కీం అమలుపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీటింగ్ కు రాష్ట్రం నుంచి హౌసింగ్, ట్రైబల్ వెల్పేర్ అధికారులు పాల్గొన్నారు. స్కీం అమలయ్యే నాటికి లబ్ధిదారుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
పదేండ్లుగా ఈ స్కీం కింద నిధులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నది. ఈ నేపథ్యంలో పీఎం జన్మన్ స్కీం కింద 13వేల మంది గిరిజనులకు ఫండ్స్ వస్తే రాష్ట్రంపై కొంత ఆర్థిక భారం తగ్గుతుందని హౌసింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పీఎం ఆవాస్ స్కీమ్ లో భాగంగా రూరల్ లో ఒక్కో ఇంటికి రూ.72 వేలు, అర్బన్ లో రూ.1.50 లక్షలు అందజేస్తున్నది. ఈ నిధులు కూడా ఇందిరమ్మ ఇండ్లకు అందనున్నాయి. ప్రధాని మోదీని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు పీఎం ఆవాస్ స్కీమ్ లో భాగంగా రాష్ట్రానికి 25 లక్షల ఇండ్లు కేటాయించాలని కోరారు.