కాషాయీకరించే.. యూజీసీ ముసాయిదా!

కాషాయీకరించే.. యూజీసీ ముసాయిదా!

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 వెలుగులో పాఠశాలలు,  కళాశాలల విద్యా ప్రణాళికలను కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యలో పాఠ్యాంశాలలో మార్పు కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2023 (నేషనల్ కరికులం ఫ్రేంవర్క్ ) విడుదల చేసింది. ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యకోసం అభ్యసన ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళిక చట్రం (లెర్నింగ్ అవుట్ కం బేస్డ్ కరికులం ఫ్రేంవర్క్) పేరుతో ఉన్నత విద్య కోసం ముసాయిదాను విడుదల చేసింది. 

ఈ ముసాయిదాపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, వృత్తినిపుణుల అభిప్రాయాలను స్వీకరిస్తామని కూడా తెలిపింది. బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే పాఠ్యాంశాల కాషాయీకరణను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ముసాయిదాను యూజీసీ విడుదల చేసింది. ఆ రకంగా కేంద్రం భిన్నాభిప్రాయాలను ఖాతరు చేయకుండా దూకుడుగా ముందుకు వెళ్తోంది. జాతీయ విద్యా విధానం బహుళ విభాగ కోర్సులు, సమగ్ర విద్యను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత ముసాయిదా ఒకే ప్రధాన విభాగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, బహుళ విభాగ అధ్యయనాలకు పరిమిత స్థానమిచ్చింది. 

ప్ర స్తుత కొత్త పాఠ్యప్రణాళిక చట్రం ముసాయిదా భారతీయ జ్ఞాన వ్యవస్థలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించడమైంది. మానవ శాస్త్రం, రసాయన శాస్త్రం, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, గృహ శాస్త్రం, గణితం, భౌతిక విద్య, రాజకీయ శాస్త్రాలకు సంబంధించిన సూచనలు కొత్త పాఠ్య ప్రణాళిక చట్రంలో ఉన్నాయి. ‘సరస్వతికి వందనం‘తో రసాయన శాస్త్రంపై పాఠ్య ప్రణాళిక చట్రం ప్రారంభమవుతుండగా, వాణిజ్య పాఠ్యాంశాలతో ‘కౌటిల్యుడి అర్థశాస్త్రం‘ బోధించాలనే సూచనలు చేర్చారు. ‘భారతీయ స్వాతంత్ర్య పోరాటం’ అనే కోర్సు పఠన జాబితాలో వీ.డీ.సావర్కర్ రాసిన ‘భారత స్వాతంత్ర్య యుద్ధం’ అనే పుస్తకం చోటు సంపాదించింది.

గణితశాస్త్రం

గణితశాస్త్రంలో మండల జ్యామితి, యంత్రాలు, రంగోలి, కోలం అల్గోరిథమిక్ కళారూపాలు, ఆలయ నిర్మాణం, ఆయాది నిష్పత్తులపై కోర్సులలో చేర్చుతారు. అంకగణితం, జ్యామితి, బీజగణితం, కాలిక్యులస్ రంగాలలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుల కృషి , ఈ వెలుగులో భారతదేశంలో అభివృద్ధి చేసిన మౌలికమైన గణిత భావనలు, పద్ధతులను, వాటి అనువర్తనాలను విశ్లేషించడం ఈ లక్ష్యాలలో ఉన్నాయి. 

వాణిజ్య విద్య

భారతీయ తత్వశాస్త్రం నుంచి ఉద్భవించిన సమగ్ర అభ్యాస విధానాన్ని వాణిజ్య విద్య కలిగి ఉండాలి. పురాతన గురుకుల వ్యవస్థ శారీరక, భావోద్వేగ, మేధో, ఆధ్యాత్మిక వృద్ధిని కలిగి ఉన్న వ్యక్తుల సర్వతోముఖాభివృద్ధిని నొక్కి చెప్పింది. ఈ విలువలను వాణిజ్యానికి వర్తింపజేసినప్పుడు, నైతిక నిర్ణయం తీసుకోవడం, బాధ్యతాయుతమైన నాయకత్వం, స్థిరమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 

అర్థశాస్త్రం

కౌటిల్య అర్థశాస్త్రం నేటికీ సంబంధితంగా ఉన్న వాణిజ్య నిబంధనలు, పాలన  ఆర్థిక నిర్వహణపై అంతర్​ దృష్టిని అందిస్తుందని ముసాయిదా పేర్కొంది. ధార్మిక ఆలోచనలో సంపద, సంక్షేమం (శ్రేయస్సు), ఆర్థిక వ్యవస్థలో రాజు పాత్ర, వాణిజ్యం, కార్మిక నీతి, గిల్డ్ సంకేతాలు, సామూహిక సంస్థ బహుమతి, పర్యావరణ, వ్యవసాయ విలువలు, దాన, స్వదేశీ మార్పిడి వ్యవస్థల సూత్రాలు ఆర్థిక శాస్త్ర కోర్సులలో బోధిస్తారు. 

పరిశోధన 

రసాయన శాస్త్రంలో, ‘ఆల్కహాలిక్ పానీయాల రసాయన శాస్త్రం’ అనే మాడ్యూల్‌లో,  సంప్రదాయ భారతీయ పులియబెట్టిన పానీయాలు, తయారీ పద్ధతులు, కిణ్వ ప్రక్రియ సమయంలో చక్కెరలను ఇథనాల్‌గా మార్చే ప్రక్రియను బోధించాలి.  ప్రాచీన భారతీయులలో పరమాణువు గురించిన క్లుప్తమైన అవగాహన ఉండేదని,  పరమాణు నిర్మాణం, పరమాణు భావనకు సంబంధించిన యూనిట్‌లో బోర్ సిద్ధాంతంతో పాటు బోధిస్తారు. 

మానవశాస్త్రం

మానవ శాస్త్రంలోని పాఠ్యాంశాలలో చరకుడు, సుశ్రుతుడు, బుద్ధుడు, మహావీర వంటి ప్రాచీన ఆలోచనాపరులు ప్రకృతి, సంస్కృతి మధ్య సహజీవన సంబంధాన్ని చాలాకాలంగా చర్చించారనే  స్వదేశీ దృక్పథాల భావనను చేర్చారు. కానీ గౌతమ బుద్ధుడు, మహావీరుడు చేసిన చర్చలను, చార్వాకుల తాత్విక కృషిని మధ్యయుగాల్లో ఉన్న సూఫీ, ఇస్లామిక్, సిక్కు మతాల సంప్రదాయాలను గుర్తించడంలేదు.

- కె. వేణుగోపాల్, ఎడ్యుకేషన్​ ఎనలిస్ట్