వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ 

వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ 

కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..విదేశాల నుంచి టీకాల దిగుమతుల కోసం కేంద్రం ప్రయత్నించడం లేదనే మాట నిజం కాదని స్పష్టం చేసింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో ఈ మధ్యే సంప్రదింపులు, చర్చలు జరిగాయంది. అంతర్జాతీయంగా కొనుగోళ్లు అంత ఈజీ కాదని చెప్పింది. అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడంతో కంపెనీలు తమ ప్రాధాన్యతను నిర్ణయించుకున్నాయని తెలిపింది.

రష్యాలోని స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కి క్లినికల్ ట్రయల్స్ అనుమతులు, దిగుమతులు వేగంగా జరిగాయంది కేంద్రం. అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలను భారత్‌లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు అందించి.. ఆ తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిందిగా కోరుతున్నామంది.ఇతర దేశాల వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతి ఇవ్వలేదన్న వార్తలు కూడా నిజం కాదని స్పష్టం చేసింది.

అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, జపాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతిస్తూ ఏప్రిల్‌లోనే ప్రకటన జారీ చేశామన చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపింది. కోవాగ్జిన్ నెలకు 1 కోటి డోసుల ఉత్పత్తి  సామర్థ్యం నుంచి.. అక్టోబర్ నాటికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని.. కోవిషీల్డ్ నెలకు 6.5 కోట్ల డోసుల నుంచి 11 కోట్ల డోసులకు పెరగనుంది తెలిపింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ సమన్వయంతో మరో 6 కంపెనీల్లో ఏకకాలంలో ఉత్పత్తి చేయనుంది. అంతేకాదు..జైడస్ క్యాడిలా, బయోలాజికల్-ఈ, జెన్నోవా సంస్థల దేశీయ వ్యాక్సిన్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయంది.  

వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రం బాధ్యతల నుంచి తప్పుకుని రాష్ట్రాలకు వదిలేయలేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల అభ్యర్థనతోనే వ్యాక్సిన్ల సేకరణ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించామంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటి వరకు చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి సిఫార్సులు చేయలేదంది. వాట్సాప్ గ్రూపుల్లో కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేసే ప్యానిక్ సమాచారం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ అంశాన్ని నిర్ణయంచలేమని తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులు.. రాజకీయమే చేయాలనుకుంటారు. వ్యాక్సినేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది శాస్త్రవేత్తలు, నిపుణులని తెలిపింది కేంద్రం.