తెలంగాణ హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు!..ముందుకు కదలని పనులు

తెలంగాణ హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు!..ముందుకు కదలని పనులు
  • రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తున్నదట
  • ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు 
  • రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కి పంపుతున్న ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు
  • అదనపు సొమ్మును తాము చెల్లిస్తామని రాష్ట్ర సర్కార్ చెబుతున్నా వినట్లే.. 
  • ఐదు నేషనల్​ హైవేలతోపాటు ట్రిపుల్​ఆర్​ విషయంలోనూ ఇదే పరిస్థితి 
  • పర్మిషన్లు​ రాక నిలిచిన భూసేకరణ.. ముందుకు కదలని పనులు 
  • పరిహారం కోసం ఆందోళనకు దిగుతున్న రైతులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైవేల భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పరిహారం చెల్లిస్తున్నదని, ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవని అడ్డంకులు సృష్టిస్తున్నది. నేషనల్ హైవేలను కేంద్రం నిర్మిస్తే, వాటికి అవసరమైన భూములు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ ​రేటుకు అనుగుణంగా ఎకరానికి ఇంత అని కలెక్టర్లు రేటు ఫిక్స్​చేసి, ఆ అవార్డు ఫైళ్లను నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌‌హెచ్‌‌ఏఐ)కు పంపితే.. వాళ్లు పర్మిషన్ ​ఇవ్వాల్సి ఉంటుంది. 

కానీ రాష్ట్ర సర్కార్ ఖరారు చేస్తున్న భూముల రేట్లు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నాయని, కేంద్ర నిబంధనలు అందుకు ఒప్పుకోవంటూ ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు కొర్రీలు పెడ్తున్నారు. భూముల రేట్లు తగ్గిస్తేనే భూసేకరణకు అనుమతిస్తామని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు సార్లు వివిధ హైవేలు, ట్రిపుల్‌‌ ఆర్‌‌‌‌కు సంబంధించి రాష్ట్ర అధికారులు పంపిన భూసేకరణ అవార్డుల ఫైళ్లను ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు తిప్పి పంపారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న పలు జాతీయ రహదారులు, రీజినల్​రింగ్​ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. బహిరంగ మార్కెట్‌‌లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములకు తక్కువ మొత్తంలో పరిహారం చెల్లిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు వినిపించుకోవడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, మార్కెట్​రేట్లకు తగ్గట్టుగానే కలెక్టర్లు రేట్లు ఫైనల్​చేశారని.. పెంచిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నా ఒప్పుకోవడం లేదు. దీంతో అటు పనులు ముందుకుసాగడం లేదు.. ఇటు పరిహారం అందకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ అంశాన్ని సీరియస్​గా తీసుకున్న రాష్ట్ర సర్కార్..త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే కేంద్రమంత్రికి సీఎం రేవంత్​ రెడ్డి ప్రత్యేక లేఖ రాయనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

పరిహారంపైనే పేచీ..

భూసేకరణ జరిగే ప్రాంతాల్లో గత మూడేళ్లలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల సగటు మార్కెట్ విలువను బట్టి పరిహారం లెక్కిస్తారు. దీనినే బేసిక్ మార్కెట్ వాల్యూ అంటారు. భూసేకరణ చట్టం 2013ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ఆర్‌‌‌‌వో కార్యాలయంలో నమోదైన మార్కెట్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు రెండు రెట్లు పరిహారం చెల్లించాలి. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.3 లక్షలు ఉంటే అందుకు 4 రెట్లు అంటే- రూ.12 లక్షలు బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. ఈ మొత్తం మార్కెట్ విలువకు అదనంగా 100%  ఇచ్చే పరిహారాన్ని ‘సోలేషియం’ అంటారు. ఈ రూ.12 లక్షలు కూడా కలిపితే అప్పుడు బాధిత కుటుంబానికి చెల్లించే మొత్తం పరిహారం రూ.24 లక్షల దాకా వస్తుంది.

 ఇక రీజినల్ రింగ్​రోడ్డు నార్త్​పార్ట్​కు సంబంధించిన భూసేకరణ ఇంకా పూర్తికాలేదు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్​వాల్యూ రూ.కోటి దాకా ఉంది. ఆ భూములకు ఎకరాకు రూ.24 లక్షల పరిహారం తీసుకునేందుకు రైతులు అంగీకరించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా ఖరారు చేసి కలెక్టర్లు పంపిస్తున్న అవార్డు ఫైళ్లను ఎన్‌‌హెచ్ఏఐ అధికారులు తిరిగి వెనక్కి పంపుతున్నారు.  రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అదనపు పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నా.. ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు అంగీకరించడం లేదు. రాష్ట్రం చెల్లించే అదనపు సొమ్ముకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అభ్యంతరం చెబుతున్నారు. 

పెండింగ్‌‌లో హైవేల పనులు.. 

మంచిర్యాల‌‌–-వ‌‌రంగ‌‌ల్‌‌-–ఖ‌‌మ్మం-–విజ‌‌య‌‌వాడ జాతీయ ర‌‌హ‌‌దారి (ఎన్‌‌హెచ్‌‌-163జి) గ్రీన్‌‌ఫీల్డ్​హైవే, ఆర్మూర్‌‌–-జగిత్యాల‌‌–-మంచిర్యాల (ఎన్‌‌హెచ్‌‌-63), జ‌‌గిత్యాల‌‌–-క‌‌రీంన‌‌గ‌‌ర్ (ఎన్‌‌హెచ్‌‌-563), మ‌‌హ‌‌బూబ్‌‌న‌‌గ‌‌ర్‌‌-–మ‌‌రిక‌‌ల్‌‌–-దియోసుగూర్ (ఎన్‌‌హెచ్‌‌-167) ర‌‌హ‌‌దారుల‌‌కు సంబంధించి ప‌‌రిహారం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. హైదరాబాద్ – నాగ్‌‌పూర్ (ఎన్ హెచ్ 44) కు సంబంధించిన 17 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లున్న రెండు ప్యాకేజీల పనుల్లో రోడ్ వైడెనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది.  మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్ నుంచి ఉమ్మడి వరంగల్ మీదుగా విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తుండగా, చాలాచోట్ల సర్కారు ఖరారు చేసిన రేట్లకు భూములు ఇచ్చేందుకు అక్కడి రైతులు అంగీకరించడం లేదు. 

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అధికారులు గుర్తించిన రూట్ లో భూములన్నీ రూ.కోట్లు విలువ చేస్తుండగా, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో ఎకరానికి రూ.15 లక్షల వరకు మాత్రమే పరిహారం వస్తోంది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ ద్వారా రూ.30 లక్షల వరకు పరిహారం చెల్లించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. కానీ రూ.కోట్లు విలువ చేసే భూములకు రూ.లక్షల్లో ఇవ్వడమేంటని, కొందరు రైతులు కోర్టుకు కూడా వెళ్లారు. గతంలో రాష్ట్రంలో మార్కెట్​విలువల సవరణ జరగకపోవడం కూడా ఈ సమస్యకు దారితీసింది. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకుని పరిహారం పెంచి పంపుతున్నా ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఆ ఫైళ్లను వెనక్కి పంపడం సమస్యగా మారింది. రీజినల్​రింగ్​రోడ్డు నార్త్​ పార్ట్​లో 1,919.68 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 88% నుంచి 95% వరకు భూసేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

 కానీ ఇందులో చాలా భూములకు అవార్డులు ప్రకటించలేదు. ప్రకటించిన వాటికి ఎన్‌‌హెచ్‌‌ఏఐ అప్రూవల్స్​ఇవ్వకుండా ఫైల్స్​ను వెనక్కి పంపడమే ఇందుకు కారణం. ఇక్కడ కూడా ఎకరా భూమి రూ.కోటి వరకు పలుకుతున్నది. కానీ కేవలం రూ.20 లక్షల నుంచి 30 లక్షల పరిహారం అనేసరికి రైతులు అంగీకరించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సూచనతో కలెక్టర్లు పరిహారాన్ని రూ.60 లక్షల దాకా పెంచి ఇచ్చేందుకు అవార్డులు ప్రకటిస్తుండగా, వాటిని ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు ఆమోదించడం లేదు. ఉదాహరణకు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌‌లోని 13 గ్రామాలు, ఆందోల్‌‌ డివిజన్‌‌లోని ఐదు గ్రామాలు కలిపి మొత్తం 824 ఎకరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి డివిజన్‌‌కు సంబంధించి 24 అవార్డులకుగాను ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు ఆరింటికి మాత్రమే అప్రూవల్‌‌ ఇచ్చారు. ఆందోల్‌‌కు సంబంధించిన భూసేకరణ అవార్డులకు ఇంకా అప్రూవల్‌‌ రావాల్సి ఉంది.  

భూసేకరణ ప్రక్రియ ఇలా..

ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఒక కొత్త రహదారి లేదా ప్రస్తుత నేషనల్ హైవే విస్తరణ కోసం ముందు అలైన్‌‌మెంట్‌‌ ఖరారు చేస్తుంది. ఈ అలైన్‌‌మెంట్ ప్రకారం ఎంత భూమి అవసరమో నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం- 2013ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భూసేకరణ చేయ నున్న ప్రాంతాలను ప్రకటిస్తుంది. భూసేకరణ వల్ల ఎంతమంది ప్రభావితమవుతారు? వారి జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే అంశాలపై సామాజిక ప్రభావ అంచనా నివేదిక తయారు చేస్తుంది. 

కాగా, ఈ  భూసేకరణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లోని జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు. భూమి మార్కెట్ విలువ, నిర్మాణాలు, చెట్లు, పంటలు మొదలైనవాటిని అంచనా వేసి, భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని లెక్కిస్తారు. దీన్ని అవార్డ్ అంటారు. ఈ అవార్డ్‌‌ను ప్రకటించి, భూ యజమానులకు తెలియజేస్తారు. సాధారణంగా జాతీయ రహదా రుల భూసేకరణకు అయ్యే ఖర్చును ఎన్‌‌హెచ్‌‌ఏఐ లేదా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కొన్ని ప్రాజెక్టులకు పరిహారంలో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉదాహరణకు రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులకు పరిహారంలో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు ఖరారు చేస్తున్న అదనపు పరిహారాన్ని సొంతంగా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటున్నా ఎన్‌‌హెచ్‌‌ఏఐ అంగీకరించకపోవడమే ప్రధాన సమస్యగా మారింది.