వరద సాయంపై కేంద్రం స్పందించడం లేదు

వరద సాయంపై కేంద్రం స్పందించడం లేదు

వరద సాయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రంలో భారీ నష్టం సంభవించిందని కేంద్రానికి నివేదిక పంపితే ఇంతవరకు స్పందన లేదన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరదల వల్ల రాష్ట్రంలో 1400 కోట్ల మేర నష్టం జరగగా..తక్షణం వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరితే..ఉలుకు పలుకు లేద‌న్నారు. గత నాలుగేళ్లలో వివిధ రాష్ట్రాల‌కు వరద స‌హాయం అందించిన కేంద్రం..తెలంగాణకు మాత్రం రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. ప్రకృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో రాష్ట్రాల‌కు అండ‌గా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం త‌న బాధ్యత‌ను విస్మరించిందని విమర్శించారు. ఆర్థికసాయం చేయాల్సింది పోయి..పాలు, పప్పు, ఉప్పుల‌పై జీఎస్టీ విధిస్తూ సామాన్యుల‌పై ప‌న్ను భారం మోపుతోందని ధ్వజమెత్తారు.

ఉత్తర తెలంగాణకు తీరని నష్టం

ఇటీవల కురిసిన వర్షాలకు ఉత్తర తెలంగాణల్లో తీరని నష్టం వాటిల్లింది. ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అదేవిధంగా బండి సంజయ్ అమిత్ షా తో సమావేశమై రాష్ట్రంలో వరద నష్టంపై వివరించారు. వెంటనే స్పందించిన అమిత్ షా రాష్ట్రానికి ఉన్నతస్థాయి బృందాన్ని పంపాలని అధికారులను ఆదేశించారు. దీంతో వరద నష్టంపై అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలు ఈనెల 20న రాష్ట్రానికి వచ్చాయి. పలు జిల్లాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశాయి.