తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష ఇలా : ఏపీ సెక్రటేరియట్ కు నిధులు.. పాలమూరు డీపీఆర్ వెనక్కి..!

తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష ఇలా : ఏపీ సెక్రటేరియట్ కు నిధులు.. పాలమూరు డీపీఆర్ వెనక్కి..!

హైదరాబాద్, వెలుగు:కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తెలంగాణ పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. తాజాగా పీఎం  నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలపగా.. ఇందులో గుజరాత్, ఏపీ రాష్ట్రాలకే పెద్దపీట వేసింది. రూ. 2,169 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2ఏ  విస్తరణకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. 

అటు ఏపీలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే  వైజాగ్ మెట్రో (ఫేజ్-1)కు ఆమోదం తెలపగా, విజయవాడ-–అమరావతి మెట్రో కనెక్టివిటీకి  సంకేతాలిచ్చింది. అదే సమయంలో తెలంగాణలో అత్యంత కీలకమైన మెట్రో రెండో దశ అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​) ఫైనాన్షియల్ ​క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎప్పట్లాగే పెండింగ్ పెట్టింది. 

ఏపీ సెక్రటేరియేట్​ నిర్మాణాలకు రూ. 2,534 కోట్లు 

ఏపీలోని అమరావతి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చింది. అమరావతిలో రూ. 1,299 కోట్ల వ్యయంతో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోటికి తెచ్చేలా ‘సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్’ నిర్మాణానికి ఆమోదం ముద్ర వేసింది. కేంద్ర ఉద్యోగుల వసతికి రూ. 1,235 కోట్ల వ్యయంతో నివాస సముదాయాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ. 2,534 కోట్లతో అమరావతిలో భారీ భవన నిర్మాణాలకు కేంద్రం లైన్​ క్లియర్​ చేసింది. 

అమరావతి  పునర్నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి ఇప్పించేందుకు అంగీకరించింది. ఏపీ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌‌లో రూ. 9,417 కోట్లు కేటాయించగా, వివిధ 79 రకాల పథకాల ద్వారా రూ. 15,031 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ. 11,465 కోట్లను రిలీజ్‌‌‌‌ చేసింది. విభజన చట్టం కింద మంజూరైన ఐఐటీ, ఐఐటీడీఎం, ఐఐఎం, ఎన్‌‌‌‌ఐటీలాంటి ప్రతిష్టాత్మక సంస్థల శాశ్వత భవనాల నిర్మాణానికి తుది విడత నిధులు ఇచ్చి క్యాంపస్‌‌‌‌లను అందుబాటులోకి తెచ్చింది.

పాలమూరు డీపీఆర్ వెనక్కి..

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేంద్రం నుంచి  గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దక్షిణ తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా సానుకూల నిర్ణయం రాలేదు. పైగా ఈ ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్రం వెనక్కి పంపింది. 

గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉందంటూ, మైనర్ ఇరిగేషన్ కింద చూపిన కేటాయింపులపై స్పష్టత లేదంటూ సాంకేతిక కారణాలతో మెలికలు పెట్టింది. ఇదే సమయంలో, ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పునరావాస ప్యాకేజీల కోసం కేంద్రం ఇటీవల కాలంలోనే రూ. 2,809 కోట్ల నిధులను నిరాటంకంగా విడుదల చేయడం గమనార్హం.