
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరకుండా, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులపై 1966లో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. 58 ఏండ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న బ్యాన్ ను ఎత్తివేశామని కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈమేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తెలిపారు. ‘‘గోవధకు వ్యతిరేకంగా 1966 నవంబరు 7న పార్లమెంటులో భారీఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ లక్షల సంఖ్యలో మద్దతుదారులను కూడగట్టాయి. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానించింది. దీంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లో చేరకుండా 1966 నవంబర్ 30న నిషేధం విధించింది” అని మాలవీయ తెలిపారు. నాడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అలాచేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు రాజ్యాంగవిరుద్ధంగా అమల్లోకి తెచ్చిన నిషేధాన్ని ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎత్తివేసిందని ఆయన తెలిపారు.
ఉద్యోగులను విడగొట్టే యత్నం: ఖర్గే
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారు. భావజాలం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులను మోదీ ప్రభుత్వం విభజించే ప్రయత్నం చేస్తున్నదని ట్విట్టర్లో ఆయన మండిపడ్డారు. ‘‘రాజ్యాంగబద్ధ సంస్థలను, స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్ను మోదీ ప్రభుత్వం వాడుకుంటున్నది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్లో చేరకుండా ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేసింది. ఈ నిర్ణయం ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చే ప్రమాదం ఉంది” అని ఖర్గే అన్నారు.