లోకల్ బాడీల్లో నిధుల ఖర్చు లెక్కలు చెప్పాలన్న కేంద్రం

లోకల్ బాడీల్లో నిధుల ఖర్చు లెక్కలు చెప్పాలన్న కేంద్రం
  • స్థానిక సంస్థల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు 
  • సొంత ఆదాయం కల్పించడంపై దృష్టి పెట్టాలి

 
హైదరాబాద్, వెలుగు : గత మూడేండ్లలో లోకల్ బాడీల్లో చేసిన నిధుల ఖర్చుపై లెక్కలు చెప్పాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు ఇతర మార్గాల్లో ఇచ్చిన ఫండ్స్, వాటిని ఎలా ఖర్చు చేశారో రిపోర్టు ఇవ్వాలని కోరింది. ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చులకు సరైన లెక్కలు చూపకపోతే ఫండ్స్ ఆపేస్తామని హెచ్చరించింది. లోకల్ బాడీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇటీవల లెటర్​రాసింది. లోకల్ బాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అందులో పేర్కొంది. పై స్థాయిలో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో ఉండే ఎంపీటీసీలు, సర్పంచ్ లు పని చేసుకునేలా మెకానిజం ఉండాలని చెప్పింది. చట్ట సభలను లోకల్ బాడీలతో లింక్ చేయాలని తెలిపింది. లోకల్ బాడీలకు సొంత ఆదాయం కల్పించడంపై దృష్టిసారించాలని సూచించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో దేశవ్యాప్తంగా స్టడీ చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. 

పంచాయతీలకే నిధులపై ఏమంటరు?
ఆర్థిక సంఘం నిధులతో పాటు గ్రామ పంచాయతీలకు అనేక రకాలుగా కేంద్రం నుంచి ఫండ్స్ వస్తున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలుగా వినియోగిస్తున్నాయి. 15వ ఫైనాన్స్​కమిషన్ డైరెక్టుగా పంచాయతీలకే నిధులు జమ చేస్తోంది. ఇందుకోసం పబ్లిక్​ ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్​సిస్టమ్ వాడుతోంది. అయితే నేరుగా నిధులు పంచాయతీలకే జమ చేసే విషయమై ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో అభ్యంతరం వస్తోంది. మరోవైపు గతంలో చేసిన ఖర్చుల వివరాలను అడిగితే అనేక రాష్ట్రాల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఇక మీదట గ్రామాల్లో అమలు చేసే పథకాలకు ఇచ్చే ఫండ్స్​ను కూడా నేరుగా పంచాయతీల అకౌంట్లలోనే జమ చేసేలా ప్లాన్​చేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలకు కేంద్రం తెలిపింది. దీనికోసం సెపరేట్ మెకానిజం ఉండేలా చూస్తున్నామని తెలిపింది. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది. 

చట్టసభలతో లోకల్ బాడీలు లింకప్.. 
గ్రామ పంచాయతీలకు వివిధ వనరుల ద్వారా నిధులు వస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్లతో పాటు పన్నులు, ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూరుతాయి. అయితే మరిన్ని మార్గాల ద్వారా పంచాయతీలు ఆదాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని కేంద్రం సూచించింది. చట్టసభలను లోకల్ బాడీలతో లింకప్ చేసే విధానంపై వర్కవుట్​చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాల్లో అధ్యయనం చేయనున్నట్లు చెప్పింది. డిస్ర్టిక్ట్​ ప్లానింగ్​ కమిటీల బలోపేతంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలను లోకల్ బాడీలతో ఎలా కనెక్ట్ చేయాలనే దానిపై స్టడీ ఉంటుందని పేర్కొంది. పంచాయతీల నుంచి వచ్చే ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలని సూచించింది.