ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్రం సీరియస్!

ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్రం సీరియస్!
  • రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు 
  • ఫామ్​హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్​ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ 
  • మాజీ పోలీస్​ అధికారుల స్టేట్​మెంట్లపైనా ఆరా 
  • పలువురు బీజేపీ అగ్ర నేతల ఫోన్లూ ట్యాప్​ చేసినట్టు అనుమానాలు
  • సాఫ్ట్​వేర్, డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ  
  • కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్​హయాంలో జరిగిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నది. బీజేపీ ముఖ్య నేత బీఎల్​ సంతోష్​ను ఫామ్​హౌస్ కేసులో ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని టాస్క్​ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. 

లిక్కర్​ కేసు నుంచి తన కూతురు కవితను కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ కేసులో తమ పార్టీ అగ్ర నేతలను ఇరికించేందుకు ప్రయత్నించారన్న విషయాన్ని బీజేపీ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతున్నది. తమ పార్టీకి చెందిన మరికొంత మంది అగ్ర నేతల ఫోన్లనూ ట్యాప్​ చేసినట్టు అనుమానిస్తున్నది. దీనిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ విభాగాలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులకు టచ్​లోకి వచ్చి ట్యాపింగ్​ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

మంగళ, బుధవారాల్లో ఢిల్లీ నుంచి కొందరు సెంట్రల్ ఇంటెలిజెన్స్​ఆఫీసర్లు ఫోన్​ చేశారని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ​వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించాలని వాళ్లు కోరిన ట్టు ఆయన చెప్పారు. మాజీ డీసీపీ రాధాకిషన్​రావుతో పాటు ఈ కేసులో అరెస్టయిన ఇతర పోలీసు అధికారులు విచారణలో వెల్లడించిన వివరాలను అందజేయాలని అడిగినట్టు పేర్కొన్నారు. ఇక నిన్నామొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్​వ్యవహారంతో తమకు పెద్దగా సంబంధం లేదని భావించిన బీజేపీ రాష్ట్ర నేతలు... అక్రమ కేసులో తమ పార్టీ నేతలను ఇరికించేందుకు కుట్ర చేశారని తెలియడంతో అలర్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ఎక్విప్​మెంట్ ఎక్కడిది? 

ఎవరి ఫోన్​ అయినా ట్యాప్​ చేయాలంటే దానికి అనేక రూల్స్ ఉంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ భద్రతకు సంబంధించి ఫోన్​ ట్యాపింగ్​చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ అనుమ తి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి కార్యకలాపాలతో పాటు కొన్ని సీరియస్​నేరాల ఇన్వెస్టిగేషన్​ సమయంలో ట్యాపింగ్​ అవసరమైతే పోలీసు ఉన్నతాధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. 

అయితే ఆ ట్యాపింగ్ కూడా నిర్ణీత సమయం వరకే చేయవచ్చు. కానీ, గత బీఆర్ఎస్​ సర్కార్​ దీన్ని ఇష్టారాజ్యంగా వాడినట్టు దర్యాప్తులో తేలింది. రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలపైనా ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయో గించింది. ఇందుకోసం అవసరమైన పరికరాలు, సాఫ్ట్​వేర్​ను విదేశాల నుంచి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపైనా తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించినట్టు తెలిసింది. ఫోన్​ ట్యాపింగ్​కు కావాల్సిన సాఫ్ట్ వేర్, పరికరాలు ఏయే దేశాల నుంచి కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.  

అలర్ట్ అయిన బీజేపీ.. 

నిన్నమొన్నటి దాకా ఫోన్​ ట్యాపింగ్​ను బీఆర్ఎస్, కాంగ్రెస్​కు సంబంధించిన అంశంగానే చూసిన బీజేపీ.. ఇప్పుడు అలర్ట్​అయింది. తమ పార్టీ అగ్ర నేతను అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని తెలిసి, దాన్ని సీరియస్​గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పకడ్బందీగా జరిగేలా చూడాలని, ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలని అనుకుంటున్నది. 

ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విచారణపై తమ పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమైన కేంద్ర నేతలు.. ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్​గా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఎన్నికలు టార్గెట్​గా ట్యాపింగ్..  

బీఆర్ఎస్ ​పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఫోన్​ ట్యాపింగ్​ను అస్త్రంగా వాడుకున్నట్టు ఈ కేసులో అరెస్టయిన పోలీసులు వెల్లడించారు. అంతకుముందు పలు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్​ను వినియోగించినట్టు చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఈ క్రమంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రఘు నందన్ ​రావు, ధర్మపురి అర్వింద్,  కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి, వివేక్ ​వెంకటస్వామి తదితర నేతల ఫోన్లను ట్యాప్​ చేసినట్టు పేర్కొ న్నారు. ఇక ఫామ్​హౌస్ కథ నడిపించి, ఏకంగా బీజేపీ టాప్ ​లీడర్ ​బీఎల్ సంతోష్​ను ఇరికించాలని చూశారు. దీంతో ఇతర అగ్ర నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉండొచ్చని బీజేపీ హైకమాండ్ అనుమానిస్తున్నది. 
 

రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు మంచి అవ కాశాలున్నాయని భావించిన ఆ పార్టీ హై కమాండ్ తెలంగాణపై స్పెషల్​ ఫోకస్​పెట్టిం ది. ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చి రాష్ట్రంలో ప్రచారం నిర్వ హించారు. కొందరు ఇక్కడే ఉండి పరిస్థి తులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీజేపీ హైకమాండ్ అనుమానిస్తున్నది. దీనిపైనా సమాచారం సేకరించాలని కేంద్ర నిఘా సంస్థలు భావిస్తున్నట్టు తెలిసింది.