సర్కారు కొత్త టార్గెట్​..రోజూ కోటి టీకాలు

సర్కారు కొత్త టార్గెట్​..రోజూ కోటి టీకాలు
  • వ్యాక్సినేషన్​లో వేగం పెంచడం కీలకం: వీకే పాల్
  • ఇకపై టీకాల కొరత ఉండదు
  • కొత్త కేసులు 42 వేలే.. 40 రోజులుగా రికవరీలే ఎక్కువ

న్యూఢిల్లీ: కరోనా ఆంక్షలను ఎత్తివేసేందుకు.. ఎకనమిక్ యాక్టివిటీస్ ప్రారంభించేందుకు.. ప్రజలు సాధారణ జీవితంలోకి వచ్చేందుకు.. వ్యాక్సినేషన్​లో వేగం పెంచడం కీలకమని కేంద్ర ప్రభుత్వం మంగళవారం చెప్పింది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 88.09 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు వేసిన సర్కారు.. రోజుకు కనీసం కోటి మందికి టీకాలు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. టీకాల కొరత ఇకపై ఉండబోదని, జులైలో రాష్ట్రాలకు 20 కోట్ల నుంచి 22 కోట్ల డోసులను సప్లై చేస్తామని చెప్పింది. ‘‘మన రోజువారీ పనులు చేసుకోవాలి. సోషల్ లైఫ్​ను కొనసాగించాలి. స్కూళ్లు, వ్యాపారాలు తెరవాలి. ఎకానమీని కాపాడుకోవాలి. అయితే వ్యాక్సిన్లను వేగంగా వేసినప్పుడే ఇదంతా చేయగలం” అని నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్ అన్నారు. వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో వేవ్ తగ్గిపోయిందని, టీకా తీసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు.
రూల్స్ పాటిస్తే.. థర్డ్ వేవ్ ఎందుకొస్తది
వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా రూల్స్​ను ప్రజలు పాటించాలని వీకే పాల్ సూచించారు. థర్డ్ వేవ్​నుంచి రక్షించుకోవాలని, కనీసం సెకండ్ వేవ్ అంత ఘోరంగా ఉండకుండా చూసుకోవాలన్నారు. ‘‘మనం కరోనా రూల్స్ ఫాలో అయితే, వ్యాక్సిన్లు వేసుకుంటే.. థర్డ్ వేవ్ ఎందుకు వస్తుంది. చాలా దేశాల్లో సెకండ్ వేవ్ రాలేదు. మనం కొవిడ్ రూల్స్ పాటిస్తే.. థర్డ్ వేవ్​ను దాటేస్తం” అని వివరించారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌టీఏజీఐ) చైర్ పర్సన్ ఎన్‌‌‌‌‌‌‌‌కే అరోరా మాట్లాడుతూ.. ‘‘కనీసం రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేయాలనేది మా లక్ష్యం. మనకు ఉన్న కెపాసిటీని బట్టి చూస్తూ.. రోజుకు 1.25 కోట్ల డోసులను ఈజీగా వేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘వ్యాక్సిన్ల షార్టేజీ లేదు. అమెరికా జనాభాతో పోలిస్తే మన జనాభా నాలుగు రెట్లు ఎక్కువ. అందరికీ వేయాలంటే కాస్త టైం పడుతుంది. జులై ఆఖరుకు లేదా ఆగస్టు ప్రారంభంలో రోజుకు కోటి మందికి టీకా వేయొచ్చు” అని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ అన్నారు. 
‘డెల్టా’పై కొవాగ్జిన్, కొవిషీల్డ్ బాగా పని చేస్తయ్
కరోనా డెల్టా వేరియంట్​పై కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఎఫెక్టివ్​గా పని చేస్తాయని హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్​ చెప్పారు. ‘‘ఇండియా సహా 80 దేశాల్లో డెల్టా వేరియంట్ ఉన్నట్లు కనుగొన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ ఇండియా సహా 9 దేశాల్లో ఉంది” అని వివరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడు తూ.. దేశంలో నమోదైన 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల్లో, 16 మహారాష్ట్రలోనే ఉన్నాయని, మిగతావి మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను జాగ్రత్తగా మానిటర్ చేయాలని మహారాష్ట్ర, ఎంపీ, కేరళ రాష్ట్రాలకు లెటర్ రాసినట్లు  తెలిపా రు. 21న 88.09 లక్షల వ్యాక్సిన్ డోసులు వేసి చరిత్రాత్మక మైలురాయిని దేశం అందుకుందని, 64% డోసులు రూరల్ ఏరియాల్లోనే వేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్​లో కొవిన్ ప్లాట్‌‌‌‌ఫామ్​ను వాడుకునేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపించాయన్నారు. మంగళ వారం మధ్యాహ్నానికి 29.16 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.