అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీకి హోంశాఖ నోట్

అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీకి హోంశాఖ నోట్

హైదరాబాద్‌, వెలుగుతెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు సిక్కిం, జమ్మూకాశ్మీర్‌ రాష్ర్టాల విధాన సభల్లో సీట్ల పెంపునకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను లోక్​సభ ఎన్నికల కన్నా ముందే హోం శాఖ తమకు పంపినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అయితే పంపిన నోట్‌ సరిగా లేదని.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను ఈసీ కోరింది. విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగి వివరాలు సేకరించారు.

రాష్ర్టంలో 153, ఏపీలో 225కు!

అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి 2019 ఏప్రిల్‌ 24న హోం శాఖ నుంచి తమకు ప్రతిపాదన అందిందని ఈసీ వివరించింది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిని 153కు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలను 24కు ఎస్టీ రిజర్వుడ్‌ సీట్లను 14కు పెంచుతున్నట్టు కేబినెట్‌ నోట్‌లో వెల్లంచింది. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం 175 సీట్లు ఉండగా, వాటిని 225కు పెంచడంతోపాటు ఎస్సీ స్థానాలను 37కు ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలను 11కు పెంచుతూ ప్రతిపాదించింది. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభాను తెలుపుతూ సవరించిన ప్రతిపాదనలు తమకు ఇవ్వాలని సదరు నోట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తిప్పి పంపామని ఈసీ వెల్లడించింది.

ఈసీ ఆమోదిస్తే ఏడాదిలో..

ఎన్నికల కమిషన్‌ కోరిన వివరాలతో సవరించిన ప్రతిపాదనలు హోం శాఖ పంపాల్సి ఉంది. అవి సరిగ్గా ఉంటే ఈసీ సంబంధిత నోట్‌ ఫైల్‌కు ఆమోదముద్ర వేయడంతో పాటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది. నోటిఫికేషన్‌, సర్వే, అభ్యంతరాల స్వీకరణ, ఫైనల్‌ నోటిఫికేషన్‌, గెజిట్‌ పబ్లికేషన్‌కు గరిష్టంగా ఏడాది వరకు సమయం తీసుకునే అవకాశముంటుంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం సంబంధిత వివరాలు పంపితే వచ్చే యేడాది చివరి నాటికి నియోజకవర్గాల పెంపు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.