
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు, దవాఖానాలు
కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదన
రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఓకే
ప్రైవేటు, పబ్లిక్ పార్ట్నర్షిప్లో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించాలన్న కేంద్ర నిర్ణయంతో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న గవర్నమెంట్ దవాఖాన్లకు అనుబంధంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు సహకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. నీతి ఆయోగ్ సైతం ఈ పీపీపీ విధానంపై ఇటీవల అభిప్రాయ సేకరణ చేపట్టింది. పీపీపీ మోడ్‌లో ఏర్పాటయ్యే ఒక్కో కాలేజీ లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో ఈ తరహా కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఈ తరహా కాలేజీల ఏర్పాటుకు స్టేట్ గవర్నమెంట్ఒప్పుకుంటే, ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముంది. ఇప్పుడు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నారు. మిగిలిన 17 జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటు చేస్తే 2,550 సీట్లు పెరుగుతాయి. ఇప్పటికే జిల్లా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అవకాశమిచ్చింది. ఇప్పుడున్న జిల్లాలకు అనుబంధంగా కాలేజీలు ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం భరిస్తుంది. ఈ రెండింట్లో ఏదో ఒక స్కీమ్‌లో చేరి కాలేజీలను పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పించింది.
పీపీపీ మోడ్‌లో దవాఖానలు
ఆయుష్మాన్ భారత్ కింద పేద కుటుంబాలకు ఏడా దికి రూ. 5 లక్షల వరకూ కేంద్రం ఉచిత వైద్యం అందిస్తోంది. దేశవ్యాప్తంగా 20 వేల హాస్పిటళ్లు ఈ స్కీం కింద ఎంప్యానల్ చేసుకున్నాయి. ఆయుష్మాన్ భారత్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ లేని జిల్లాల్లో పీపీపీ మోడ్‌లో దవాఖానలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించి బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. ఆయుష్మాన్ భారత్ స్కీం అమలు చేసేందుకు తెలంగాణ ఒప్పుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో ఒక్క దవాఖాన కూడా ఎంప్యానల్ చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అమలు చేసే అవకాశాలు లేవు. ఒక వేళ పీపీపీ మోడ్‌లో కేంద్రమే జిల్లాకో హాస్పిటళ్లు నిర్మిస్తే, రాష్ట్రంలోనూ కేంద్ర స్కీమ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.