బడి పిల్లల భోజనంలో రాజీ వద్దు.. ఆహార అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌‌‌‌ఫాస్ట్

బడి పిల్లల భోజనంలో రాజీ వద్దు.. ఆహార అలవాట్లకు  అనుగుణంగా బ్రేక్‌‌‌‌ఫాస్ట్
  •  పిల్లల శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి
  •     రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి సెంట్రల్ కిచెన్లు ప్రారంభం
  •     కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌తో కిచెన్స్​ అనుసంధానం చేస్తాం 
  •     కార్పొరేట్ సంస్థలు,  హరే కృష్ణ ఫౌండేషన్ మధ్య సీఎం సమక్షంలో ఒప్పందాలు
  •     కమ్యూనిటీ కిచెన్ల కోసం రూ.9.17 కోట్ల చెక్కులు అందించిన కార్పొరేట్ సంస్థలు 

హైదరాబాద్, వెలుగు: బడి పిల్లల భోజనం విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, ఆహార నాణ్యతలో అన్ని జాగ్రత్తలు పాటించాలని హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌‌‌‌ఫాస్ట్ తయారు చేయాలన్నారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్‌‌‌‌లోని సీఎం నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఆయనను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.


నాగర్‌‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు కోసం సీఎం సమక్షంలో ‘జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్‌‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా నాగర్‌‌కర్నూల్ కిచెన్ నిర్మాణం కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు రూ.5.17 కోట్ల చెక్కును సీఎం చేతుల మీదుగా ఫౌండేషన్‌‌కు అందజేశారు. వికారాబాద్‌‌లో అత్యాధునిక కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ రూ.4 కోట్ల చెక్కును అందించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఉదారంగా నిధులు ఇచ్చిన సంస్థల ప్రతినిధులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 

ఆహారపు అలవాట్లకు అనుగుణంగా బ్రేక్ ఫాస్ట్

ప్రభుత్వ బడుల్లో చదివే నిరుపేద విద్యార్థుల సమగ్ర వికాసానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని సీఎం అన్నారు. పిల్లలకు పోషక విలువలు, అవసరమైన క్యాలరీలు ఉండే ఆహారం అందించాలన్నారు. ఇందుకోసం ఆధునిక యాప్‌‌లను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యమైన బ్రేక్‌‌ఫాస్ట్ అందించడం వల్ల విద్యార్థులు సకాలంలో బడికి హాజరవుతారని, ఆకలి బాధ లేకపోవడంతో తరగతుల్లో వారి ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. వంటల తయారీ నుంచి పంపిణీ వరకు నాణ్యత, పరిశుభ్రతలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆహార అలవాట్లు, సంస్కృతికి అనుగుణంగా మెనూ రూపొందించి, రుచికరమైన, బలవర్ధకమైన బ్రేక్‌‌ఫాస్ట్ అందించాలని ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌తో అనుసంధానం

కిచెన్ల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని సెంట్రలైజ్డ్ కిచెన్లను హైదరాబాద్‌‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌కు అనుసంధానిస్తామని సీఎం వెల్లడించారు. ఇది తాత్కాలిక కార్యక్రమం కాదని, భవిష్యత్ తరాల కోసం నిరంతరం కొనసాగే జీవితకాల ప్రాజెక్ట్ అని చెప్పారు. కిచెన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నవంబర్ 30లోగా నాగర్‌‌కర్నూల్, వికారాబాద్ సహా అన్ని సెంట్రల్ కిచెన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని కిచెన్లను లాంఛనంగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

తమ కోసం ఆహారం ఎంత పరిశుభ్రంగా తయారవుతోందో విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి విశ్వాసం పెంచుకునేలా, కిచెన్లను సందర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి సామాజిక బాధ్యతను చాటుకోవడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ పాల్గొన్నారు.