
- 2020-21 లెక్కలు వెల్లడించిన కేంద్ర గణాంకశాఖ
- ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మందికి రుణాలే ఆధారం
- ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో కర్ణాటక టాప్, ఏపీకి సెకండ్ ప్లేస్
- దక్షిణాదిలో అప్పుల ఊబిలో చిక్కుకున్నది 31.8% మంది
- ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం 7.4 శాతం మందికే అప్పులు
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పులపై ఆధారపడినట్లు నివేదిక తెలిపింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఏపీ, తెలంగాణ నిలిచాయి. కర్ణాటకలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) (95.9%) కాగా, ఆ తర్వాత 92.3% మందితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో 23.2% మందిపైనే అప్పుల భారం ఉండగా, తెలంగాణలో 86.5% మందే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు.
ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా, 31.8% మంది అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈశాన్యరాష్ట్రాల ప్రజల్లో 80.2% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా, 7.4% మందికే అప్పులున్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం హిందువులు 88.1%, ముస్లింలు 80.8శాతం నమోదైంది. అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా, చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి.
రాష్ట్రం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అప్పుల శాతం
ఏపీ 92.3 43.7
తెలంగాణ 86.5 37.2
కేరళ 91.0 29.9
తమిళనాడు 92.0 29.4
కర్ణాటక 95.9 23.2
తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రాల ప్రజలు
ఢిల్లీ 87.3 3.4
ఛత్తీస్ గఢ్ 91.1 6.5
అసోం 80.4 7.1
గుజరాత్ 80.8 7.2
జార్ఖండ్ 80.8 7.5