
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్పూర్ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బృందం సోమవారం పరిశీలించింది. బృందంలోని సభ్యులు పెట్రోలియం, రసాయనాల శాఖ జాయింట్ సెక్రటరీ వినోద్ శేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సైంటిస్ట్ రేష్మ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఈఈ వెంకటేశ్వర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతోపాటు సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టును విజిట్ చేశారు.
రెండు దశాబ్దాలుగా ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. 2016 నుంచి పనులు ఆగిపోయినట్లు అధికారులు వివరించారు.19 గేట్లలో ఒక్కటి కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం, ప్రాజెక్టుకు విద్యుత్ లైన్ల స్తంభాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. 600 మీటర్ల బండ్ డైవర్షన్ చేయాల్సి ఉందని, కాలువల నిర్మాణం కోసం పూర్తిస్థాయిలో భూ సేకరణ చేయాల్సి ఉందని అధికారులు వారికి వివరించారు.
అనంతరం దహెగాం మండల శివారులోని కాలువను పరిశీలించారు. పీఎంకేఎస్‌వై కింద కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పూర్తికాని ప్రాజెక్టులను పరిశీలించి వాటిని కంప్లీట్ చేసి రైతులకు సాగు నీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బృందం సూచనలు చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, ఇరిగేషన్ ఈఈ ప్రభాకర్, గుణవంత్ రావు, డీఈ భద్రయ్య ఉన్నారు.