- ఎయిర్ పోర్ట్పై మరో ముందడుగు
- నేడు ఆదిలాబాద్ కు రానున్న కేంద్ర బృందాలు
- అబ్ స్టికల్ లిమిటేషన్ సర్వే చేయనున్న అధికారులు
- 450 ఎకరాల భూసేకరణకు క్షేత్రస్థాయిలో పరిశీలన
- పెద్ద విమానాలు దిగేలా రన్ వే నిర్మాణం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో మందడుగు పడనుంది. ఎయిర్ పోర్టుకు సంబంధించిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి అబ్ స్టికల్ లిమిటేషన్ సర్ఫేస్(ఓఎల్ఎస్) సర్వే చేసేందుకు శుక్రవారం కేంద్ర బృందాలు రానున్నాయి. పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సర్వే చేయనున్నారు.
ఎయిర్ పోర్ట్ మైదానం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించనున్నారు. రన్ వేకు అడ్డంకిగా ఉన్న భవనాలు, చెట్లు, ఇతర నిర్మాణాల గుర్తించి, వాటి ఎత్తును కొలిచి నివేదిక తయారు చేయనున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతే అధికారులు పూర్తిస్థాయిలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు.
భూసేకరణపై స్పష్టత వచ్చే అవకాశం
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్లో రక్షణకు శాఖకు 360 ఎకరాల ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 450 ఎకరాలు సేకరించి మొత్తం భూమిని రక్షణ శాఖకు బదలాయించాలని తెలిపారు.
మొదట్లో రక్షణ, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించినప్పటికీ.. ఇక్కడి మైదానానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, వైమానిక దళ శిక్షణకు కీలకమైన ప్రాంతం కావడంతో పూర్తిస్థాయిలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కేంద్ర బృందాలు ఓఎల్ఎస్ సర్వేకు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓఎల్ఎస్ సర్వే తర్వాత 450 ఎకరాలు ఎటువైపు సేకరించాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పెద్ద విమానాల కోసం రన్వే..
ఆదిలాబాద్లో నిర్మించే ఎయిర్పోర్టులో పెద్ద విమానాలు దిగేలా రన్వే నిర్మాణం చేపట్టనున్నారు. ఎయిర్ బస్ లాంటి పెద్ద విమానాలు దిగేందుకు అనువుగా నిర్మాణం చేపడుతుండడంతో ఎయిర్పోర్ట్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. రక్షణశాఖ వైమానిక శిక్షణ కేంద్రానికి, పౌర విమానయాన టర్మినల్స్కు సంబంధించి ఇక్కడ వేర్వేరుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) టవర్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఓఎల్ఎస్ సర్వే ముగిసిన తర్వాత మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు. ఈ మాస్టర్ ప్లాన్ కు రక్షణ శాఖ అంగీకారం తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి భూమిపూజ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణంపై గతేడాది నుంచి ఒక్కొక్కటిగా అనుమతులు వస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు సేకరించనుండగా వ్యవసాయ భూములకు సంబంధించి కచ్ కంటి, అనుకుంట గ్రామాల ప్రజలు, విమానాశ్రయ మైదానానికి ఆనుకొని ఉన్న కాలనీ ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు.

