
కలెక్టర్ల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్
నిజామాబాద్/మహాముత్తారం/ ములుగు, వెలుగు : నిజామాబాద్, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. బాధితులతో మాట్లాడుతూ వారి కష్టాలు వింటూ.. నష్టాలను నమోదు చేసుకున్నాయి. అలాగే అయా జిల్లాల కలెక్టర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా సెంట్రల్ టీమ్స్‌కు నష్టాలను వివరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సింఘాల్, కృష్ణ ప్రసాద్ తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్మండలాల్లో పర్యటించారు. ముందుగా జక్రాన్‌పల్లి మండలం పడకల్ పెద్దచెరువును పరిశీలించారు. ఈ చెరువు కింద 527 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నీటమునిగాయి. కట్ట తెగిపోవడం వల్ల కేశ్ పల్లి, కొరటపల్లి, దర్పల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం సెంట్రల్టీమ్సభ్యులు మనోహరాబాద్– కలిగోట్ గ్రామాల మధ్య కొట్టుకపోయిన రోడ్డును, ఇదే మార్గంలో ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంట పొలాలను పరిశీలించారు. ఆర్మూర్ మండలం పిప్రి వద్ద దెబ్బతిన్న లోలెవెల్ వంతెన, కాజ్ వే, వేల్పూరు మండలం జానకంపేట్ పెద్దవాగులో ధ్వంసమైన చెక్ డ్యామ్, మోర్తాడ్ మండలం దొన్ పాల్ వద్ద పూర్తిగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్డు, దోంచంద వద్ద నష్టపోయిన పంటలు, కూలిన, దెబ్బతిన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. కేంద్ర బృందం వెంట ఇరిగేషన్ ఎస్ ఈ నారాయణ, ట్రాన్స్ కో ఎస్ ఈ రవీందర్, పంచాయతీ రాజ్ ఈఈలు శంకర్, మురళి, భావన్న తదితరులు ఉన్నారు. తర్వాత వరద నష్టంపై ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను టీమ్ సభ్యులు చూశారు.
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో
జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి పార్తిబన్, డైరెక్టర్ ఆఫ్ జూట్ డెవలప్‌మెంట్ కె.మనోహరన్, కేంద్ర జలసంఘం డైరెక్టర్ రమేశ్ కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ శివకుమార్ కుష్వాహతో కూడి టీమ్ పర్యటించింది. మహాముత్తారం మండలంలో దెబ్బతిన్న రోడ్లు, పంటలను వీరు పరిశీలించారు. దౌతుపల్లి వద్ద వాగు ప్రవాహంతో కొట్టుకుపోయిన పత్తి పంట, కేశవపూర్ దగ్గర కొట్టుకపోయిన కాటారం–మేడారం డబుల్ రోడ్డును పరిశీలించారు. భూపాలపల్లిలోని జెన్ కో గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వరద నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత కేంద్ర బృందం ములుగు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిచింది. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లాలో పంట, ఇతర నష్టాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో 5,937ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, వరదల వల్ల 84 గ్రామాలు, 34 లోతట్టు ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని వివరించారు. 19 రోడ్లు 89.15 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని తెలిపారు. కేంద్ర బృందం పర్యటనలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్ హనుమంతు, వరంగల్ కలెక్టర్ గోపీ, ములుగు అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.