బంద్.. కొన్నిచోట్లే

బంద్.. కొన్నిచోట్లే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ట్రేడ్‌‌‌‌ యూనియన్లు బుధవారం చేపట్టిన భారత్‌‌‌‌ బంద్‌‌‌‌ బెంగాల్‌‌‌‌ మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ముగిసింది. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ అఫ్లియేటెడ్‌‌‌‌ భారతీయ మజ్దూర్‌‌‌‌‌‌‌‌ సంఘ్‌‌‌‌ (బీఎంఎస్‌‌‌‌) మినహా 10 సెంట్రల్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ యూనియన్లు ఈ బంద్‌‌‌‌లో పాల్గొన్నాయి. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్త బంద్‌‌‌‌ చేయడం ఇది నాలుగోసారి. దాదాపు 25 కోట్ల మంది బంద్‌‌‌‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. లేబర్‌‌‌‌‌‌‌‌ రిఫార్మ్స్‌‌‌‌ ప్రతిపాదనను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌‌‌‌ సహా మొత్తం 14 డిమాండ్లతో ఈ బంద్‌‌‌‌ చేపట్టారు. పశ్చిమబెంగాల్‌‌‌‌లో బంద్‌‌‌‌ సందర్భంగా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌‌‌‌ చేస్తున్న వారిపై సీఎం మమతా బెనర్జీ ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. రాజకీయ ఉనికి కోల్పోయిన వారే బంద్‌‌‌‌ చేస్తారని విమర్శించారు.

రణరంగమైన బెంగాల్‌‌‌‌

కోల్‌‌‌‌కతా: యూనియన్‌‌‌‌ యాక్టివిస్టులతో పాటు లెఫ్ట్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ పార్టీల ఆధ్వర్యంలో బెంగాల్‌‌‌‌లో నిర్వహించిన బంద్‌‌‌‌ హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఆందోళనకారులు బస్సులు, ట్రైన్లను అడ్డుకున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈస్ట్‌‌‌‌ బుర్ద్వాన్‌‌‌‌, ఈస్ట్‌‌‌‌ మిడ్నాపూర్‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. బస్సులపై రాళ్లు విసిరారు. జాదవ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్‌‌‌‌ చేశారు. ఆందోళనకారులను తరిమికొట్టేందుకు టియర్‌‌‌‌‌‌‌‌గ్యాస్‌‌‌‌ ఉపయోగించారు. లేక్‌‌‌‌టౌన్‌‌‌‌ తదితర ప్రాంతాల్లో లెఫ్ట్‌‌‌‌, తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. కోల్‌‌‌‌కతాలో ఆందోళన చేస్తున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 నార్త్‌‌‌‌ పరగణ జిల్లాలో ఆందోళనకారులు నాటు బాంబులు వేశారని, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. జాదవ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌‌‌ కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

ఇబ్బందిపడ్డ జనం

కేరళలో జనం ఇబ్బందులు పడ్డారు. కేఎస్‌‌‌‌ఆర్టీసీ, ప్రైవేట్‌‌‌‌ క్యాబ్స్‌‌‌‌, ఆటో రిక్షాల వాళ్లు కూడా బంద్‌‌‌‌లో పాల్గొనడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బంద్‌‌‌‌ కారణంగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీలు పరీక్షలను పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ చేశాయి. నాగాలాండ్‌‌‌‌లో పోస్టల్‌‌‌‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో పోస్టల్‌‌‌‌ సర్వీసులు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్ట్‌‌‌‌ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు.

మంచునూ లెక్కచేయకుండా

హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లోని సిమ్లా తదితర ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తున్నా లెక్కచేయకుండా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. లెఫ్ట్‌‌‌‌ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కొన్నిచోట్ల ప్రభావం చూపని బంద్‌‌‌‌

గోవా, త్రిపుర, అస్సాం, యూపీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో బంద్‌‌‌‌ అంతంగా ప్రభావం చూపలేదు.