
- సీవీసీ 2024 వార్షిక నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులపై 2024 డిసెంబరు 31 నాటికి 60 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) తెలిపింది. వాటిలో 22 కేసులు నాలుగేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించింది.
2024కు సంబంధించిన వార్షిక నివేదికను సీవీసీ విడుదల చేసింది. దేశంలోనే ప్రముఖ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే కేసులు పెండింగ్ లో ఉన్నాయంటే దేశ ప్రతిష్ట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సీవీసీ పేర్కొంది.
ఆ నివేదిక ప్రకారం.. 2024 డిసెంబరు 31 నాటికి గ్రూప్ ఏ ఆఫీసర్లపై 39 డిపార్ట్ మెంటల్ కేసులు, గ్రూప్ బీ, సీ అధికారులపై 21 కేసులు వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ అధికారులను విచారణ చేయడానికి ప్రాసిక్యూషన్ సాంక్షన్ లేకపోవడం కూడా కేసులు పెండింగ్లో ఉండడానికి కారణమని సీవీసీ తన నివేదికలో పేర్కొంది. అలాగే, సీబీఐలో 1500పైనే పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.