అన్ని షాపులు ఓపెన్ చేసుకోవచ్చు.. కండిషన్స్‌ అప్లై

అన్ని షాపులు ఓపెన్ చేసుకోవచ్చు.. కండిషన్స్‌ అప్లై
  • నివాస ప్రాంతాల్లో దుకాణాలకు పర్మిషన్ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: లాక్​డౌన్ నుంచి దుకాణాదారులకు, కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. కొన్ని కండిషన్లతో నివాస ప్రాంతాల్లో దుకాణాలు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. మాల్స్ మినహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లో రిజిస్టర్ అయిన అన్ని షాపులు తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఆదేశాలిచ్చింది. ‘‘ దేశవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో మార్కెట్ కాంప్లెక్స్ లు, అన్ని రిజిస్టర్డ్ దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కంటైన్మెంట్ జోన్లు, కరోనా హాట్ స్పాట్ జోన్లలో మాత్రం మల్టీ బ్రాండ్ మాల్స్ లో ఉన్న షాపులకు ఈ అనుమతులు వర్తించబోవు”అని ఆర్డర్ లో స్పష్టం చేసింది. 50 శాతం సిబ్బందితో మాత్రమే షాపులు తెరవాలని, మాస్కులు, హ్యండ్ గ్లోవ్స్ కచ్చితంగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని కండిషన్స్ విధించింది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్​డౌన్ విధించగా.. రాష్ట్రంలో మే 7 వరకు అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న స్థాయిని బట్టి ఆయా రాష్ట్రాలకు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద రూల్స్ విధించుకునే అధికారాలున్నాయి. లాక్ డౌన్ నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు రాష్ట్రాలు విధించిన నిబంధనలపై ఆధారపడి అమల్లోకి వస్తాయి.

కండిషన్లివే
మున్సిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో లేని నివాస ప్రాంతాల్లో మాత్రమే అనుమతి
దుకాణాలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు కింద రిజిస్టర్ అయి ఉండాలి
50 శాతం సిబ్బందితో మాత్రమే షాపులు తెరవాలి
హ్యాండ్ గ్లోవ్స్, మాస్కులు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి

తెరిచేందుకు అనుమతించబడేవి
గ్రామీణ ప్రాంతాల్లో నమోదు చేసుకున్న అన్ని దుకాణాలు, మార్కెట్లు
పట్టనాలు, నగరాల్లో వస్తువులు అమ్ముకునే దుకాణాలు

వీటిని తెరిచేందుకు పర్మిషన్ ఉండదు
హెయిర్ సెలూన్లు, బార్బర్ షాపులు,
బార్‌లు, వైన్​షాపులు, రెస్టారెంట్లు
మల్టీ-బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్‌లు
వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు
స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, ఆడిటోరియంలు