సంస్కరణల పితామహుడు

సంస్కరణల పితామహుడు

పీవీ నరసింహరావు 28 జూన్ 1921న నేటి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో  బ్రాహ్మణ  కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యలో కొంత భాగాన్ని హన్మకొండ జిల్లా భీమ్‌‌‌‌‌‌‌‌దేవరపల్లి మండలం కట్కూరు గ్రామంలో తన బంధువు గబ్బెట రాధాకిషన్ రావు ఇంట్లో ఉంటూ ఆర్ట్స్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు.  

1938లోనే హైదరాబాద్​ రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్​ విశ్వవిద్యాలయంలో చేరి  మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్​ఎల్బీ చదివాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోనూ, హైదరాబాదు విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్​ నాయకులు మర్రి చెన్నారెడ్డితో  కలిసి పనిచేశాడు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు

తెలంగాణ గడ్డ మీద పుట్టి ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ప్రజ్ఞాశాలి. ఆర్థిక సంస్కరణల పితామహుడు. 17 భాషల్లో ప్రావీణ్యం గల సాహితీవేత్త. పీవీకి ప్రధాన మంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ.. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశలో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. కానీ, ఆ సమయంలో అది ఓ ముళ్ల కిరీటం. స్థిరత్వం లేని ప్రభుత్వం. దీనికి తోడు చిక్కి శల్యమై చితిపైకి చేరిన ఆర్థిక వ్యవస్థ. కానీ, పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని దీటుగా ఎదుర్కొన్నారు. ఓ వైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టారు.

ఆర్థిక వ్యవస్థకు జీవం పోసిన మేధావి

పీవీకి పూర్వం  దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చైనా 1962, పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌ 1971తో యుద్ధాలతో ప్రారంభమైన ఎకానమీ పతనం పీవీ అధికారంలోకి వచ్చేనాటికి గడ్డు పరిస్థితికు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వలను విదేశీ బ్యాంకుల్లో కుదువ పెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి. వ్యవస్థలు దివాలాతీసి అస్తవ్యస్తమైనా.. పీవీ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్‌‌‌‌‌‌‌‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి సంస్కరణల బాట పట్టించారు. అద్భుతమైన ఫలితాలు సాధించి, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు.

సంస్కరణలతో ఆర్థిక పురోగతి

భారత్‌‌‌‌‌‌‌‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ కల. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని బీజేపీ ప్రభుత్వ సంకల్పం. 2019లో యూకే, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ను వెనక్కినెట్టి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఈ స్థాయికి చేరడం రాత్రికి రాత్రే జరిగలేదు. పీవీ హయాంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఈ తీరానికి చేరుకోవడంలో సరైన దారి చూపాయనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు పీవీదే.

అపర చాణుక్యుడు

పీవీ మృదుస్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. 17 భాషల్లో దిట్ట. గోండుల భాష నుంచి స్పానిష్ వరకూ ధారాళంగా మాట్లాడేవారు. క్యూబన్ విప్లవ యోధుడు క్యాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ని స్పానిష్ భాషలో పలకరించి పీవీ ఆశ్చర్యపరిచారట. రచయితగానూ పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. సొంతపేరుతో, మారు పేర్లతో కాలమిస్టుగా ఎన్నో వ్యాసాలు రాశారు.

పీవీ రచనల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన గొల్ల రామవ్వ ప్రముఖమైనది. ఇన్ సైడర్ పేరుతో పీవీ చేసిన రచనను ఆయన ఆత్మకథగా చెబుతారు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలను ఆయన హిందీలోకి సహస్ర ఫణ్  పేరుతో అనువదించారు. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా.. అవసరానికి మించి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని బ హుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా  పేర్కొంటారు.
- జాజుల దినేష్, సోషల్​ ఎనలిస్ట్​