రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
  •     మార్చి 23 నుంచి సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయం
  •     హోటల్స్, రెస్టారెంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన 
  •     వలస కూలీల కోసం 5 కేజీల సిలిండర్లు పంపిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ గ్యాస్​పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్​గ్యాస్ ను సరఫరా చేస్తామని, వాణిజ్య సిలిండర్ల పంపిణీని పెంచాలని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సూచించింది. పశ్చిమాసియాలో సంక్షోభంతో ఎల్‌‌‌‌పీజీ దిగుమతులు దెబ్బతిని వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తీవ్రంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓవరాల్​గా కమర్షియల్ గ్యాస్​ కేటాయింపులు 50 శాతానికి చేరుకున్నట్టయింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం శాఖ సెక్రటరీ  నీరజ్ మిట్టల్ శనివారం లేఖ రాశారు. 

అదే విధంగా వలస కూలీలకు 5 కిలోల సిలిండర్లు అందజేయాలని, వాటిని తామే సరఫరా చేస్తామని తెలిపింది. అయితే వాటిని ఉచితంగా గానీ, స్వల్ప ధరలకు గానీ నేరుగా కార్మికుల ఫ్యామిలీలకు చేరేలా చూడాలని వెల్లడించింది. వాణిజ్య సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్‌‌‌‌లు, సబ్సిడీ ఆహార కేంద్రాలకు ఇవ్వాలని కేంద్రం సూచించింది. పెట్రోలియం కంపెనీల వద్ద రిజిస్టర్ అయిన వాణిజ్య సంస్థలతో పాటు పీఎన్‌‌‌‌జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి ఈ అదనపు కేటాయింపులు వర్తిస్తాయని తెలిపింది.