కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మహర్దశ.. తెలంగాణకు రూ.5వేల681 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మహర్దశ..  తెలంగాణకు రూ.5వేల681 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్

 

  • రూ.1,420 కోట్లు ఇవ్వనున్న కేంద్రం.. మిగతా నిధులు హడ్కో రుణం 
  • పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం
  • రూ.4,674.6 కోట్లతో  వరంగల్​లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
  • కరీంనగర్ సిటీలో రూ.842 కోట్లతో మూడు ప్రాజెక్టులు
  • కరీంనగర్, వరంగల్, ఖమ్మం సహా 26 మున్సిపాలిటీల్లో రూ.166.44 కోట్లతో ఏఐ బేస్డ్ ఐసీసీసీల ఏర్పాటు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు సహా 26 మున్సిపాలిటీలకు అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్​) స్కీమ్ కింద రూ.5,681 కోట్ల విలువైన పనులకు  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1,420 కోట్లు మాత్రమే ఇవ్వనుండగా మిగతా నిధులన్నీ హడ్కో, కేఎఫ్​ డబ్ల్యూ రుణాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. 

గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికవడంతో కరీంనగర్, వరంగల్ నగరాల్లో పలు అభివృద్ధి పనులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మంజూరైన ప్రాజెక్టులతో ఈ రెండు స్మార్ట్ సిటీల్లో పెండింగ్ పనులు పూర్తి కానున్నాయి. కరీంనగర్, వరంగల్, ఖమ్మం సహా 26 మున్సిపాలిటీల్లో రూ.166.44 కోట్లతో ఏఐ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు (ఐసీసీసీ)ఏర్పాటు చేయనున్నారు. ఇవేగాక రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ టూ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల కోసం యూసీఎఫ్ కింద మరో రూ.14 వేల కోట్ల విలువైన మరో 23 మున్సిపల్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 

కరీంనగర్‌‌కు మూడు ప్రాజెక్టులు.. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల వరద రానుంది. యూసీఎఫ్ స్కీం కింద కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.840 కోట్ల విలువైన పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.210 కోట్లు కేంద్రం ఇవ్వనుండగా.. మిగతా రూ.630 కోట్లు హడ్కో రుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా ఆమోదం లభించింది. 

అలాగే, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌‌‌‌ప్రాజెక్టు కింద కరీంనగర్ మానేరు తీరంలోని డంప్ యార్డు ప్రక్షాళన, మానేరు రివర్ ఫ్రంట్ పునరుద్ధరణ కోసం రూ.80 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. 

రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మోడల్ రోడ్ల నిర్మాణం కోసం రూ.630 కోట్లు కేటాయించారు. ఈ పనులు పూర్తయితే కరీంనగర్ ప్రజలను దశాబ్దాలుగా ఊపిరిసలపనివ్వని డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కానుంది. వాస్తవానికి తొలుత రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీఎఫ్ ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్ లేదు. వరంగల్ కార్పొరేషన్ ప్రతిపాదనలను మాత్రమే యూసీఎఫ్ స్కీంలో చేర్చారు. 

విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను సైతం యూసీఎఫ్ జాబితాలో చేర్చాల్సిందేనని పట్టుబట్టి చేర్పించారు. ఆగమేఘాల మీద ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసి ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు.

గ్రేటర్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి  4,674 కోట్లు 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.4,674.6 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కేంద్రం నుంచి రూ.1,168.65 కోట్ల సాయం అందనుండగా.. మిగతా రూ.2,337.30 కోట్లు జర్మన్ డెవలప్ మెంట్ బ్యాంకు కేఎఫ్ డబ్ల్యూ నుంచి రుణంగా అందనుంది.