మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. లింక్స్ తొలిగించాలన్న కేంద్రం

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. లింక్స్ తొలిగించాలన్న కేంద్రం

ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కలకలం రేపుతోంది. ప్రధాని మోడీకి గుజరాత్ అల్లర్లకు ఉన్న సంబంధంపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే దీనిపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ డాక్యుమెంటరీకి చెందిన ట్విట్టర్, యూట్యూబ్ లింక్‌ల‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అనే పేరుతో రెండు భాగాల సిరీస్ రూపొందించింది.. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది.  దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. దీనిని వలసవాద మనస్తత్వంగా, తప్పుడు ప్రచారంగా విమర్శించింది.  

2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే బీబీసీ ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బ్రిటన్ పార్లమెంట్లోనూ చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ హుస్సెన్ గుజరాత్ అల్లర్లకు మోడీనే బాధ్యుడని నిందించగా..  దానిని  యూకే ప్రధాని రిషి సునాక్ తప్పుపట్టారు. వ్యక్తిగతంగా ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడకూడదని సూచించారు. ఇదిలా ఉంటే టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ఈ డ్యాక్యుమెంటరీని షేర్ చేసిన ట్వీట్ను ట్విట్టర్ తొలగించింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.