70 ఏండ్లు దాటినోళ్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా

70 ఏండ్లు దాటినోళ్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా
  • వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తింపునకు కేంద్రం ఓకే
  • 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి
  • జల విద్యుత్ ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు
  • ఐదేండ్లలో 62,500 కి.మీ. రోడ్లు
  • ఎలక్ట్రిక్ వెహికల్స్ సబ్సిడీలకు రూ. 14 వేల కోట్లు
  • ఈ-డ్రైవ్, ఈ-బస్ పీఎస్ఎం స్కీంలకూ కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 70 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.ఆయుష్మాన్ స్కీం వర్తింపుతో మొత్తం 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా లభించనుందని ఆయన తెలిపారు. ఇదివరకే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్న కుటుంబాల్లోని వృద్ధులకు కొత్తగా ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా ఉండగా.. ఇకపై కుటుంబంతో సంబంధం లేకుండా 70 ఏండ్లు, ఆపై వయసు కలిగిన వృద్ధులకు అదనంగా రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. అయితే,ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీంలలో దేంట్లోనైనా చేరిన వృద్ధులు అందులోనే  కొనసాగవచ్చని.. లేదంటే దానిని వదులుకుని ఆయుష్మాన్ స్కీంలో చేరవచ్చని తెలిపారు.    

పొల్యూషన్ తగ్గించేందుకు రెండు స్కీంలు.. 

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు గాను పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్ఎం) అనే రెండు స్కీంలను ప్రారంభించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. పీఎం ఈ–డ్రైవ్ స్కీంకు రెండేండ్లలో రూ. 10,900 కోట్లు కేటాయించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం ఈ–బస్ పీఎస్ఎం పథకాన్ని రూ. 3,435 కోట్లతో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పీఎం ఈ–డ్రైవ్ పథకం కీలకం కానుందన్నారు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ టూవీలర్స్, త్రీ వీలర్స్, అంబులెన్స్ లు, ట్రక్కులు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు రూ. 3,679 కోట్ల సబ్సిడీలు, డిమాండ్ ఇన్సెంటివ్ లు ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ స్కీం మొత్తం 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్స్, 3.16 లక్షల త్రీవీలర్స్, 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద కొనుగోలుదారులు డిమాండ్ ఇన్సెంటివ్ లు పొందడం కోసం భారీ పరిశ్రమల శాఖ ఈ–వోచర్లను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. అలాగే ఈ–అంబులెన్స్ లకు, ఈ–ట్రక్కులకు రాయితీ కోసం రూ. 1000 కోట్లు, ప్రభుత్వ రవాణా సంస్థలు ఈ–బస్సులను సేకరించడం కోసం రూ. 4,391 కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. వీటితోపాటు 88 వేల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వివరించారు.    

ఐదేండ్లలో 62,500 కి.మీ. రోడ్ల నిర్మాణం.. 

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన నాలుగో ఫేజ్ కింద వచ్చే ఐదేండ్లలో 62,500 కిలోమీటర్ల మేరకు రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఈ పథకంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలతోసహా ఇతర రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ లేని 25 వేల ఆవాసాలకు రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల ఆధునీకరణ, కొత్త కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. 2024-25 నుంచి 2028-29 మధ్య చేపట్టే ఈ పనులకు మొత్తం రూ. 70,125 కోట్లు కేటాయించనున్నారు. ఇందులో కేంద్ర వాటా రూ. 49,087.50 కోట్లు, సంబంధిత రాష్ట్రాల వాటా రూ. 21,037.50 కోట్ల మేరకు ఉంటుందని ఈ మేరకు అధికారిక వర్గాలు తెలిపాయి. 

హైడ్రో పవర్ ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు

వచ్చే ఎనిమిదేండ్లలో 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ. 12,461 కోట్లను కేటాయించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీంను 2024-25 నుంచి 2031-32 మధ్య అమలు చేయనున్నారు. 200 మెగావాట్లలోపు సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు ఒక్కో మెగావాట్ కు రూ. కోటి చొప్పున రూ. 200 కోట్లు.. 200 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు ఒక్కో మెగావాట్ కు అదనంగా రూ. 0.75 కోట్లను కలిపి ఇవ్వనున్నారు. అయితే, కొన్ని అసాధారణ పరిస్థితులు ఉన్న చోట ఒక్కో మెగావాట్ కు రూ. 1.5 కోట్ల వరకూ కేటాయించనున్నట్టుకేంద్ర మంత్రి తెలిపారు.