భారత జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

భారత జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

భోపాల్: 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యప్రదేశ్‏లోని తన నివాసంలోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పని ఒత్తిడి కారణంగానే రోహిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రోహిణి మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాధాగంజ్‌లోని అర్జున్ నగర్‌లో ఉన్న తన నివాసంలో రోహిణి ఆత్మహత్యకు పాల్పడింది. రోహిణి ఉరి వేసుకోవడం చూసిన ఆమె చెల్లెలు రోష్ని కలాం వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రోహిణి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోహిణి ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నదని, ఉద్యోగానికి సంబంధించి ఒత్తిడిలో ఉందని రోహిణి సోదరి రోష్ని పోలీసులకు చెప్పింది. పాఠశాల ప్రిన్సిపాల్ ఆమెను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

 రోహిణి స్పోర్ట్స్ కెరీర్:

మధ్యప్రదేశ్‎కు చెందిన రోహిణి కలాం జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్. 2007లో ఆమె క్రీడా జీవితాన్ని స్టార్ట్ చేసింది. 2015లో జుజిట్సులో పోటీపడటం ప్రారంభించింది. చైనాలో హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలలో రోహిణి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ క్రీడలకు ఎంపికైన ఏకైక భారతీయ అథ్లెట్ రోహిణిని కావడం విశేషం.

ఆసియా జుజిట్సు ఛాంపియన్‌షిప్‌లలో రోహిణి ఎన్నో పతకాలను సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో 48 కిలోల విభాగంలో కాంస్య పతకం, అబుదాబిలో జరిగిన 8వ ఆసియా జుజిట్సు ఛాంపియన్‌షిప్ 2024లో డ్యూయో క్లాసిక్ ఈవెంట్‌లో మరో కాంస్య పతకం గెల్చుకుంది. ఆటలో ఎన్నో విజయాలు సాధించిన రోహిణి ఒత్తిడిని జయించలేక తనువు చాలించింది.