
- సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు
- 5.25 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమని అంచనా
- మిల్లింగ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలతో సివిల్సప్లై ఆఫీసర్లు రంగంలోకి దిగారు. వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్‌సింగ్ లెటర్ రాశారు.
మే 31లోగా లబ్ధిదారులకు రేషన్అందించాలని, ఇందుకోసం ముందస్తు బియ్యం లిఫ్టింగ్, పంపిణీ ప్రక్రియలో ఎఫ్‌సీఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
5.25 లక్షల టన్నుల సన్నబియ్యం కావాలె
రాష్ట్రంలో మే నెల కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్‌లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు మూడు నెలలకు కావాల్సిన సన్నబియ్యాన్ని సమకూర్చుకునేందుకు సివిల్ సప్లై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ -1, స్టేజ్2 గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు.
వీటి ఆధారంగా జూన్, జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్‌లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతినెలా 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ల నుంచి సన్నబియ్యం నిల్వలను సమీకరించనున్నారు. ఈ క్రమంలోనే సన్న వడ్ల మిల్లింగ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు సివిల్ సప్లై ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు.