- 35 నియోజకవర్గాల్లో 410 కి.మీ రోడ్ల వైడెనింగ్
- అన్ని ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
- ఇటీవల గడ్కరీని కలిసిన సీఎం రేవంత్, మంత్రి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద రాష్ర్టంలో రోడ్ల విస్తరణకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూ. 868 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా రాష్ర్టంలోని 35 నియోజకవర్గాల్లో 410 కి.మీ రోడ్ల విస్తరణ జరగనుంది. నిధుల విడుదలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఎక్స్ లో వెల్లడించారు. ఇందులో సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి ఫోర్ వే రోడ్లు ఉన్నాయి.
గత నెలలో సీఆర్ఐఎఫ్ కింద వర్క్ లు సాంక్షన్ చేయాలని నితిన్ గడ్కరీకి ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల ప్రతిపాదనలు, రోడ్డు పేరు, కిలోమీటర్లు, విస్తరణకు అయ్యే ఖర్చుతో లేఖను పంపారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు వెళ్లి కేంద్ర రవాణా శాఖ అధికారులతో సమావేశమై రోడ్ల ప్రాధాన్యత గురించి వివరించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో గడ్కరీని కలిసి ప్రపోజల్స్ ను అంగీకరించాలని విన్నవించారు.
రాష్ర్టం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రోడ్ల విస్తరణకు రూ.868 కోట్లు మంజూరు చేయాలని గడ్కరీకి వెంకట్ రెడ్డి ఇటీవల మరోసారి లేఖ రాశారు. త్వరలో ఈ రోడ్లకు డీపీఆర్ తయారీకి ఆర్ అండ్ బీ (ఎన్ హెచ్) వింగ్ అధికారులు టెండర్లు పిలవనున్నారు.
వచ్చే ఏడాదిలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. డీజిల్, పెట్రోల్ మీద వసూలవుతున్న సెస్ అమౌంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల్లో రోడ్ల విస్తరణకు సీఆర్ఐఎఫ్ స్కీమ్ కింద నిధులు కేటాయిస్తోంది. కాగా.. గత ఏడాది రూ. 335.58 కోట్లు తెలంగాణకు కేంద్రం కేటాయించింది.
