ట్విట్టర్‌‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం

ట్విట్టర్‌‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం
  • హైప్రొఫైల్‌ అకౌంట్ల హ్యాకింగ్‌పై

న్యూఢిల్లీ: మన దేశంలోని సైబర్‌‌ సెక్యూరిటీ నోడల్‌ కంప్యూటర్‌‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌‌టీ–ఇన్‌) ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌‌కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల హై ప్రొఫైల్‌ ట్విట్టర్‌‌ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు ఏజెన్సీలోని ఒక అధికారి మీడియాతో చెప్పారు. హ్యాకర్లు పెట్టిన లింక్‌లను సందర్శించిన భారతీయ వినియోగదారుల సంఖ్య, వారికి కలిగిన నష్టం గురించి, ఆ అకౌంట్ల గురించి వారికి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారా లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని ట్విట్టర్‌‌ను కోరినట్లు తెలుస్తోంది. హ్యాకింగ్‌కు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలని ప్రభుత్వం ట్విట్టర్‌‌ను కోరింది. అంతే కాకుండా హ్యాకింగ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ట్విట్టర్‌‌ తీసుకున్న చర్యల గురించి కూడా చెప్పాలని కోరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలబ్రెటీలు, బిజినెస్‌ మ్యాన్‌ల ట్విట్టర్‌‌ ఖాతాలు ఇటీవల హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, బిల్‌గెట్స్‌, జో బిడెన్‌ తదితరుల ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో ఇండియా ఈ నోటీసులు జారీ చేసింది.