
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ పెట్టి ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు బీసీ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. బీసీ ధర్నాతోనైనా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలి. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో చట్టం చేయకపోతే తెలంగాణలో బీజేపీకి రాజకీయ సమాధి తప్పదు.
రిజర్వేషన్లు పెంచే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లదే. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మూడున్నర నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఒక విధంగా, కేంద్రంలో మరో విధంగా బీజేపీ ప్రవర్తిస్తున్నది. బీసీలను మోసం చేయాలని చూస్తున్నది. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి’’అని జాజుల అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీల నోటికాడి ముద్దను గుంజుకుంటే బీజేపీకి తెలంగాణలో రాజకీయంగా పుట్టగతులు ఉండవని, ఇలాగే బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే బీసీల ద్రోహిగా మిగిలిపోతుందని మండిపడ్డారు.