- పీఎం పోషణ్ స్కీమ్ విస్తరణకు కేంద్రం చర్యలు
- 9 నుంచి 12వ క్లాస్ విద్యార్థులకూ మిడ్డెమీల్స్..
- దీనిపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- ఈ ఏడాది నుంచే తెలంగాణలో అమలు చేస్తున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న భోజనానికే పరిమితమైన పీఎం పోషణ్ స్కీమ్‌ను భారీగా విస్తరించేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇకపై స్కూళ్లలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ జోషి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఇటీవల లేఖ రాశారు.
ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాల సూచనలను 10 రోజుల్లోగా పంపాలని కోరారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఈ స్కీముకు అంగీకారం తెలుపుతూ ఇప్పటికే ఇక్కడ అమలవుతున్న తీరుపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కేంద్రానికి లేఖ రాయనున్నారు.
ఇంటర్ వరకు భోజనం..
ప్రస్తుతం పీఎం పోషణ్ పథకం కింద నర్సరీ నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే భోజనం అందిస్తోంది. దీన్ని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, తెలంగాణలో ముందు నుంచే పదో తరగతి వరకూ మిడ్డెమిల్స్ అందిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ తో పాటు మిడ్డెమిల్స్ నూ ఇంటర్ వరకూ అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు స్కీము మొదలైంది. అక్టోబర్ వరకూ అన్ని విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో అమలు కానున్నది. ఈ స్కీము అమలులో భాగంగా మిడ్డెమిల్స్ వర్కర్స్ కు ప్రస్తుతం కేంద్రం ఇచ్చే రూ. వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3వేలకు పెంచాలని ప్రతిపాదించింది. అయితే, తెలంగాణలో మాత్రం రూ.2వేలు ఇస్తున్నారు.
పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు..
మిడ్డెమీల్స్ కు అవసరమైన మౌలిక సదుపాయాల పెంపుపైనా కేంద్రం దృష్టి సారించింది. సమర్థవంతంగా భోజనం తయారు చేసేందుకు ఒక్కో కిచెన్‌కు రూ.55 లక్షల వ్యయంతో క్లస్టర్ లేదా క్లౌడ్ కిచెన్లను నిర్మించనున్నారు. విద్యార్థులు భోజనం చేసేందుకు వీలుగా ఒక్కో విద్యార్థికి రూ. వంద చొప్పున కేటాయించి.. దశలవారీగా ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు పంపిణీ చేయనున్నారు.
