- త్వరలో 49 శాతానికి పెరిగే అవకాశం కనీసం 51 శాతం వాటా కేంద్రం చేతుల్లోనే
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ లిమిట్‌ను) 49శాతం వరకు పెంచాలని కేంద్రం చూస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి 20శాతం కాగా, ప్రైవేట్ బ్యాంకులకు ఇది 75శాతం వరకు ఉంది. ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే ప్రభుత్వ బ్యాంకుల్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయి. అయితే ప్రభుత్వం తన వాటాలో కనీసం 51శాతాన్ని కొనసాగిస్తుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐతో ఈ అంశంపై చర్చలు జరుపుతోందన్నారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం కెనరా బ్యాంక్‌లో 12శాతం విదేశీ వాటా ఉండగా, యూకో బ్యాంక్‌లో వీరి వాటా దాదాపు సున్నా. ప్రస్తుతం 12 ప్రభుత్వ బ్యాంకులు కలిపి రూ.171 లక్షల కోట్ల ఆస్తులతో దేశ బ్యాంకింగ్ రంగంలో 55శాతం వాటాను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ లిమిట్ పెంచే అవకాశం ఉండడంతో సోమవారం నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.02శాతం పెరిగి 8,053.4 పాయింట్ల రికార్డు స్థాయికి చేరింది. చివరికి 2.22శాతం లాభంతో ముగిసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో భారత ఫైనాన్షియల్ రంగంలో జరిగిన విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ విలువ ఏడాది లెక్కన 127శాతం పెరిగి 8 బిలియన్ డాలర్లకు చేరింది. మేలో జపాన్‌కు చెందిన సుమిటోమో మిట్సుయి బ్యాంక్ యెస్ బ్యాంక్‌లో 20శాతం వాటాను కొనుగోలు చేసి, ఆగస్టులో దీన్ని 24.99 శాతానికి పెంచుకుంది. ఈ నెలలో దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇదే నెలలో ఎన్‌బీఫ్‌సీ కంపెనీ సమ్మాన్ క్యాపిటల్ బిలియన్ డాలర్ల విలువైన వాటాను అబుదాబీకి చెందిన సంస్థకు విక్రయించింది.
