న్యూఢిల్లీ: సంచార్ సాథీ సైబర్ సెక్యూరిటీ యాప్ విషయంలో మోడీ సర్కార్ యూటర్న్ తీసుకుంది. దేశంలో విక్రయించే స్మార్ట్ ఫోన్‌లలో సంచార్ సాథీ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 3) కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
గత 24 గంటల్లో ఆరు లక్షలకు పైగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఆపిల్‌తో సహా అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు జారీ చేసిన ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశాన్ని ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది. సంచార్ సాథీ యాప్ ప్రీ–ఇన్‌స్టాల్ ఆదేశం కేవలం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.
కాగా, దేశంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంచార్ సాథీ సైబర్ సెక్యూరిటీ యాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియాలో అమ్మే అన్ని సెల్ ఫోన్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ డిఫాల్ట్ (తప్పనిసరి)గా ఉండాలని మొబైల్ కంపెనీలకు కేంద్రం ఆదేశించింది.
ALSO READ : ఇలాంటి ఘటనలు రిపీట్ కావొద్దు..
యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసుకునే వీల్లేకుండా చూడాలని కోరింది. కేంద్రం ఆదేశాలపై ప్రతిపక్షాలు, గోపత్యావాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంచార్ సాథీ ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశం ప్రజల గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తుందని, అలాగే ప్రజలపై గూఢచర్యం చేయడానికి అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నదని మండిపడ్డాయి. ఇది ముమ్మాటికి దేశ ప్రజల పర్సనల్ డేటాపై నిఘా పెట్టడమే అని విమర్శించాయి. ప్రీ ఇన్సాస్టాలేషన్ ఆదేశంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఆదేశాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
