
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హఠాత్తుగా మరణించడంతో ఆయన ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. కొత్త సీడీఎస్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారు అనే దానిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం లేదు. అయితే, ఫ్లాగ్ ఆఫీసర్లు, సాయుధ దళాల కమాండింగ్ ఆఫీసర్లు ఈ పదవి చేపట్టడానికి అర్హులని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎస్) జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె, చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (సీఐఎస్ సీ) ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్‌కు పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం చూస్తే జనరల్ నరవణె సీడీఎస్ అయ్యే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. చైనాతో బార్డర్ గొడవ, కాశ్మీర్, నార్త్ ఈస్ట్‌లో అంతర్గత భద్రతా సమస్యలు ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో నరవణెకు ఉన్న అనుభవం ఉపయోగపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్ కంటే నరవణె రెండేండ్లు సీనియర్ కావడం కూడా కలిసొస్తుందని చెప్తున్నారు.