నాగాలాండ్‌‌లో ఏఎఫ్‌‌ఎస్పీఏ చట్టం రద్దుకు కమిటీ

నాగాలాండ్‌‌లో ఏఎఫ్‌‌ఎస్పీఏ చట్టం రద్దుకు కమిటీ

కొహిమా: నాగాలాండ్‌‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌‌ఎస్పీఏ)ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం కమిటీ వేసిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాగాలాండ్‌‌ సీఎం నిఫియు రియో ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఆయన తాజాగా ట్విట్టర్‌‌‌‌లో వెల్లడించారు. ఈ భేటీలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా పాల్గొన్నారు. ఏఎఫ్‌‌ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేసే అంశాన్ని అమిత్‌‌ షా సీరియస్‌‌గా తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రియో ట్విట్టర్‌‌‌‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో కేంద్ర, రాష్ట్ర సర్కార్‌‌‌‌ అధికారులు, రాష్ట్ర పోలీసులు సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ నివేదికను 45 రోజుల్లోగా సమర్పించనుంది. కాగా, కమిటీ సిఫార్సుల ఆధారంగానే ఏఎఫ్‌‌ఎస్‌‌పీఏ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోనుంది. నాగాలాండ్‌‌లో ఆర్మీకి విశేష అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్‌‌ఎస్పీఏ చట్టాన్ని ఇటీవల తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయాలని మొదటి నుంచి ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్‌‌ చేస్తూ వస్తున్నారు. ఈ నెల మొదట్లో మాన్‌‌ జిల్లాలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. అప్పట్నుంచి ఏఎఫ్‌‌ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌‌లు మరింత పెరిగాయి. ఈ క్రమంలో కేంద్రానికి, ఆర్మీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. కాల్పుల ఘటనలో పాల్గొన్న ఆర్మీ యూనిట్‌‌, సిబ్బందిపై కోర్ట్‌‌ ఆఫ్‌‌ ఎంక్వైరీ కింద క్రమశిక్షణ చర్యలను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.