ఫిబ్రవరి మొదటివారంలోగా దళితబంధు లబ్దిదారుల ఎంపిక

ఫిబ్రవరి మొదటివారంలోగా దళితబంధు లబ్దిదారుల ఎంపిక
  • మార్చి మొదటి వారంలో యూనిట్లు గ్రౌండింగ్
  • ఎమ్మెల్యేలు, అధికారులు త్వరితగతిన లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి
  • కేంద్ర ప్రభుత్వం దేశమంతా దళితబంధు చేపట్టాలి
  • కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర మంత్రి హరీష్ రావు డిమాండ్

సంగారెడ్డి: ఫిబ్రవరి మొదటివారంలోగా దళితబంధు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి మార్చి మొదటి వారంలో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు నిర్దేశించారు. ఎమ్మెల్యేలు, అధికారులు త్వరితగతిన లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆదివారం సంగారెడ్డి  జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా  దళిత బంధు సమీక్ష సమావేశం  కేవలం జిల్లా  ఎమ్మెల్యేలు, ఎంపీ ల తో సమీక్ష  సమావేశం జరిపామని ఈ సందర్భంగా హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం  దళిత బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. 
బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఆదర్శంగా  తీసుకుని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. మిషన్ భగీరథ ను 'హర్ ఘర్ జల్ ' పేరుతో,  రైతు బంధు ను కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో  కేంద్రం అమలు చేస్తోందని వివరించారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన  దళితబంధు పథకాన్ని కూడా దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశం లో ఉన్న 26 కోట్ల దళితులకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని వారి కోసం దళిత బంధు ప్రకటించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ ను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో  దళితుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం  6198 కోట్లు  ఖర్చు పెడితే   ఈ ఏడున్నరేళ్లలో తమ టీఆర్ ఎస్ ప్రభుత్వం  24114 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. 
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి  అన్యాయం చేస్తోంది
కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను  అమ్మకాలకు పెట్టి  ఎస్సీ,  ఎస్టీ లకు అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో   " మన ఊరు- మన బడి" పేరుతో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతానాని ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే   బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు ఆగమాగమైతున్నారని ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటేనే కార్పొరేట్ పార్టీ గా పేరుంది,  ప్రభుత్వం బడుల్లో ఇంగ్లీష్ మీడియం పై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న  మీరు కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లకు మద్దతు  తెలుపదలుచుకున్నారా అనేది బండి సంజయ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 
నవోదయ విద్యాలయాలు, గిరిజన, మైనింగ్ యూనివర్సిటీలు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో 296 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఇప్పుడు 914 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ విద్యాలయం ఉండాలి, ఈ లెక్కన మన రాష్ట్రానికి ఇంకా 21 నవోదయ విద్యాలయాలు రావాలి, బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుండి నవోదయ విద్యాలయాలు, ట్రైబల్ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ తీసుకురావాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రాంతీయ భాషల్లో  కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగ పోటీ పరీక్షలు లేకపోవడం కారణంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం జరుగుతోందని,   కేవలం హిందీ లో కాకుండా  ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఏనాడో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే   ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వాని ఒప్పించాలన్నారు. మన రాష్ట్రంలో 1,03,657 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేరని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ అక్కసును, గుడ్డి వ్యతిరేకత ను ప్రదర్శిస్తున్నారని తప్పుపట్టారు. కేసీఆర్ తెలంగాణ తెస్తా అన్నాడు తెచ్చి చూపిండు, మిషన్ భగీరథ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు లాంటి పథకాలు తెస్తామన్నారు, తెచ్చి చూపారు. అదే తరహాలో  మన ఊరు-మన బడి తెస్తామని  కేసీఆర్  చెప్పిండు, తెచ్చి చూపిస్తాడని మంత్రి హరీష్ రావు వివరించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీది

కోహ్లీ గొప్ప క్రికెటర్..బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు