గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు: కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా

గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు: కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా

ఆసిఫాబాద్/తిర్యాణి, వెలుగు: వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర కార్పొరేట్​వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా పేర్కొన్నారు. ఆదివాసీలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు బుధవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తో కలిసి తిర్యాణి మండలం ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని పరిశీలించారు. 

సుంగాపూర్ లో 2.75 కోట్లతో నిర్మిస్తున్న స్కూల్ బిల్డింగ్ పనులను చూసి మొక్కలు నాటారు. కోలాం గిరిజనులకు ఆధార్, జాబ్, జనన ధ్రువీకరణ పత్రాలు, జన్ ధన్ ఖాతా పుస్తకాలు పంపిణీ చేశారు.  అనంతరం జిల్లా కేంద్రంలో ఆదర్శ అంగన్ వాడీ కేంద్రానని సందర్శించారు.  ఆ తర్వాత జెడ్పీ స్కూల్‎కు వెళ్లి విద్యార్థులు ఇంగ్లీష్‎లో రాసిన కథలపై విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 

అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రధాని మోదీ చేపట్టిన పథకాలతో మంచి పురోగతి వస్తుందని చెప్పారు. అనంతరం సంప్రదాయ గుస్సాడీ నృత్యం ద్వారా స్వాగతం పలకగా.. బృందానికి కేంద్ర మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.