రైతు పంటను ఎక్కడైనా అమ్ముకునేలా కొత్త చట్టం

రైతు పంటను ఎక్కడైనా అమ్ముకునేలా కొత్త చట్టం
  •     మూడో విడత ప్యాకేజీలో 1.63 లక్షల కోట్లు కేటాయింపు
  •     వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక శాఖలకు నిధులు
  •     లక్ష కోట్లతో అగ్రి ఇన్​ఫ్రాస్ర్టక్చర్ ఫండ్
  •     రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిత్యావసరాల చట్టం
  •     మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు
  •      తేనెటీగల పెంపకానికి, మూలికల సాగుకు ఫండ్స్

న్యూఢిల్లీ:రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా, తమకు నచ్చిన చోట అమ్ముకునేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై కంట్రోళ్లను తొలగిస్తామని చెప్పారు. ఆత్మ నిర్భర్‌‌ భారత్‌‌ అభియాన్​లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి.. మూడో విడత కేటాయింపులను శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​తో కలిసి నిర్మల వివరించారు. 1.63 లక్షల కోట్లను వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు కేటాయించారు.

మంచి ధర వచ్చిన చోట..

‘‘రైతులు ప్రస్తుతం తమ పంటను ఏపీఎంసీ (అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలు)ల్లోని లైసెన్స్‌‌దారులకు మాత్రమే విక్రయించాలి. కానీ పారిశ్రామిక ఉత్పత్తులకు అమ్మకంపై మాత్రం అలాంటి ఆంక్షలు లేవు. ఇలాంటి రిస్ర్టిక్షన్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేందుకు అవకాశం ఉండటం లేదు.గతిలేని పరిస్థితుల్లో రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకుంటున్నారు’’ అని నిర్మల వివరించారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో చట్టం తెస్తామని తెలిపారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేదని, దేశంలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ ప్రొడక్టుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తామన్నారు. ఏ పంట, ఎంతకు కొంటారో చెప్పేలా ప్రతి సీజన్‌‌కు ముందే చట్టపరమైన ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతులకు మార్కెటింగ్ అవకాశాలను పెంచేందుకు సంస్కరణలు తీసుకొస్తామన్నారు.

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల
అభివృద్ధికి రూ.లక్ష కోట్లు

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తున్నామని నిర్మల తెలిపారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఆధారిత స్టార్టప్​లకు ఈ ఫండ్​తో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ నిధి వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. గత రెండు నెలల్లో కనీస మద్దతు ధరలతో రూ.74,300 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ప్రధాన మంత్రి కిసాన్ ఫండ్ కింద రూ.18,700 కోట్లు బదిలీ చేశామని తెలిపారు. ఫసల్‌‌ బీమా యోజన కింద రూ.6,400 కోట్లు పరిహారం ఇచ్చినట్లు తెలిపారు.

పశువుల టీకాలకు రూ.13,343 కోట్లు

53 కోట్ల పశువులకు ‘ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్’, బ్రూసెల్లోసిస్ రాకుండా 100 శాతం టీకాలు వేసేందుకు రూ.13,343 కోట్లను కేటాయించారు. ఇప్పటిదాకా 1.5 కోట్ల ఆవులు, గేదెలకు ట్యాగ్ వేశామని, టీకాలు వేయించామని నిర్మల తెలిపారు. డెయిరీ ప్రాసెసింగ్‌‌లో పెట్టుబడుల తోడ్పాటుకు, పశువుల తిండికి రూ.15 వేల కోట్ల నిధిని ప్రకటించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉత్పత్తుల ఎగుమతులకు వీలుగా ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రోత్సాహాకాలు కల్పిస్తామని చెప్పారు.

మూలికల సాగుకు రూ.4 వేల కోట్లు

మూలిక (హెర్బల్)ల సాగును ప్రోత్సహించేందుకు రూ.4 వేల కోట్లు ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్ల భూమిని మూలికల సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఫండ్స్ ప్రకటించారు. ఈ చర్యలతో రైతులకు రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. గంగా నది కారిడార్​లో ఔషధ మొక్కలు నాటేందుకు 800 హెక్టార్లను డెవలప్ చేసినట్లు చెప్పారు.

తేనెటీగల పెంపకానికి రూ.500 కోట్లు

తేనెటీగల పెంపకానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంటకోత సౌకర్యాల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. రూరల్ ఏరియాల్లోని 2 లక్షల మంది తేనెటీగల పెంపకందార్లకు లబ్ధి చేకూరనుంది.

ఇంకా ఇవ్వాల్సినవి 9 లక్షల కోట్లు

ఆత్మ నిర్భర్‌‌ భారత్‌‌ అభియాన్​లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అందులో తొలి విడతలో 5.94 లక్షల కోట్లు, తర్వాత 3.16 లక్షల కోట్లు, శుక్రవారం 1.63 లక్షల కోట్లను నిర్మల కేటాయించారు. దీంతో ఇప్పటిదాకా అలొకేట్ చేసిన మొత్తం 10.73 లక్షల కోట్లకు చేరింది. ఇంకా 9 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంది.

లోకల్ తయారీ.. గ్లోబల్ మార్కెటింగ్

ఆరోగ్యకరమైన ఆహారం, సేంద్రీయ, ఇతర ఉత్పత్తులను అనుసంధానించేందుకు రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో కేసర్, బీహార్‌లో మఖానా, తెలంగాణలో పసుపు, ఆంధ్రప్రదేశ్​లో మిర్చి, ఈశాన్యంలో వెదురు.. ఇలా కొన్ని రాష్ర్టాల్లో యూనిక్​గా ఉండే పంటలను పండించే వారితో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ‘స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు’ అన్న ప్రధాని ఆలోచనకు అనుగుణంగా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘ప్రత్యేక ప్రొడక్టులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకునేలా చేస్తున్నాం. మైక్రో ఫుడ్ ఎంటర్​ప్రైజెస్ (ఎంఎఫ్ఈ) అనుసంధానానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2 లక్షల సంస్థలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది’ అని వివరించారు. దేశంలో 361 ప్రొడక్టులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ ఉన్నట్లు తెలిపారు.

నిత్యావసర వస్తువుల చట్టం సవరణ

65 ఏళ్ల కిందట తీసుకొచ్చిన నిత్యావసర వస్తువుల (ఎసెన్షియల్ కమోడిటీస్) చట్టాన్ని సవరిస్తామని నిర్మల ప్రకటించారు. రైతులకు లాభం కలిగేలా ఈ చట్టం అమలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. తృణధాన్యాలు, వంట నూనె, నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉల్లి, బంగాళాదుంపలపై నియంత్రణ ఎత్తేస్తామని తెలిపారు. ఈ చట్ట సవరణ తర్వాత ఆహార పదార్థాల ఉత్పత్తి, అమ్మకాలపై నియంత్రణ ఉండదు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు స్టాక్ లిమిట్ కూడా ఉండదు. జాతీయ విపత్తులు, కరువు వంటి అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే స్టాక్​పై పరిమితులు విధిస్తారు. భారీగా పెట్టుబడులు ఆకర్షించి, వ్యవసాయ రంగంలో పోటీ పెంచేందుకు ఇది అవసరమని కామెంట్ చేశారు.

సంతోషకరం

వ్యవసాయ ఉత్పత్తుల అంతర్​ రాష్ట్ర అమ్మకాలకు, నచ్చిన చోట రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించడం సంతోషకరం. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఈ సంస్కరణలతో రైతులకు మేలు జరుగుతుంది.

– వెంకయ్య నాయుడు, ఉపరాష్ర్టపతి

రైతుల ఇన్ కమ్ కు బూస్ట్ 

మూడో విడత కేటాయింపులు రూరల్ ఎకానమీకి, రైతుల ఇన్ కమ్ పెరిగేందుకు ఉపయోగపడతాయి. ఫైనాన్స్ మినిస్టర్ నిర్ణయాలను స్వాగతిస్తున్నాను. తాజా ప్యాకేజీతో రైతులు, మత్య్సకారులు, డెయిరీ, యానిమల్ హెజ్బెండరీ సెక్టార్ అభివృద్ధికి దోహద పడుతుంది.

– నరేంద్రమోడీ, ప్రధానమంత్రి

రైతులకు ఎంతో మేలు

కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది నిజంగా రైతులకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునేలా కొత్త చట్టం తీసుకురావడం, నిత్యావసరాల చట్ట సవరణ డిసిషన్స్ ప్రభావవంతమైన నిర్ణయాలు.

– జేపీ నడ్డా, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్

రైతులకు పైసా కూడా ఇవ్వలే

కేంద్ర ప్యాకేజీలో రైతులు, రైతు కూలీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇది జుమ్లా ప్యాకేజీ అని స్పష్టమైంది. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి పెద్దపెద్ద మాటలు చెబుతారు.. కానీ రైతులు, ఇతరులకు చేసిందేమీ లేదు. రైతులకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పాలి.

– రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్‌‌ నేత

నెలన్నర గడుస్తున్నా వడ్లు రోడ్లమీదనే