
న్యూఢిల్లీ: 2025 ఫిబ్రవరి 13న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును పార్లమెంట్లో తొలుత ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ బిల్లును లోక్ సభలో వెనక్కి తీసుకుంది. కొత్త ఐటీ బిల్లు విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ బిల్లుకు రివైజ్డ్ వెర్షన్ను ఆగస్ట్ 11న ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులో ఉన్న మల్టిపుల్ వెర్షన్స్ కారణంగా గందరగోళం తలెత్తకుండా.. కొత్త ఐటీ బిల్లులో మార్పులుచేర్పులు చేసి ఒక స్పష్టమైన.. అప్డేటెడ్ వెర్షన్ను వచ్చే సోమవారం (ఆగస్ట్ 11) సభ ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఐటీ బిల్లు 2025పై నియమించిన కమిటీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి జులై 21న పార్లమెంట్ కు నివేదిక సమర్పించింది. 4 వేల 500 పేజీలతో.. 285 సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను ఈ కమిటీ పార్లమెంట్కు నివేదించింది.
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లులో అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) , ప్రీవియస్ ఇయర్ (పీవై) వంటి పదాలకు బదులుగా ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని వాడారు. పాతదానికి బదులు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. 60 ఏళ్ల కిందటి నుంచి ఉన్న ప్రస్తుత ఐటీ చట్టంలో 298 సెక్షన్లు, 14 షెడ్యూల్స్ ఉండగా, కొత్త చట్టంలో 536 సెక్షన్లు, 16 షెడ్యూల్స్‌ఉన్నాయి. సాధారణంగా కిందటేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు గల ఆర్థిక సంవత్సరానికి రానున్న ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ కడతారు. 2024–25 ను ప్రీవియస్ ఇయర్‌గా, రానున్న ఆర్థిక సంవత్సరం 2025–26ను అసెస్‌మెంట్ ఇయర్‌గా పిలుస్తారు. కొత్త ఐటీ చట్టం అమల్లోకి వస్తే.. ఈ పేర్లకు బదులుగా ఏ ఇయర్ కోసం ట్యాక్స్ కడుతున్నారో దాన్ని ట్యాక్స్ ఇయర్‌గా పిలుస్తారు.
►ALSO READ | ఆర్థిక అవగాహన పెంచేందుకు "సమీక్ష" సిరీస్.. పిరమిల్ ఫైనాన్స్ కొత్త ప్రయోగం..!
ప్రస్తుత ఐటీ చట్టంలోని చాలా సెక్షన్లను ప్రభుత్వం తొలగించింది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌పై ట్యాక్స్, రియింబర్స్‌మెంట్స్‌పై వేసే ట్యాక్స్‌వంటి వాటిని తీసేసింది. ఈ కొత్త చట్టంలో పెద్ద పెద్ద వివరణలు, ప్రొవిజన్లు ఉండవు. చదవడానికి ఈజీగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. చిన్న వాక్యాలు వాడామని, టేబుల్స్, ఫార్ములాల ద్వారా ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా తయారు చేశామని పేర్కొంది.
టీడీఎస్‌కు సంబంధించిన అన్ని రకాల సెక్షన్లను ఒకే క్లాజ్ కిందకు తీసుకొచ్చింది. టేబుల్స్ కూడా జోడించింది. అంచనా వేసిన ఆదాయంపై బిజినెస్‌లు కట్టే ట్యాక్స్, శాలరీలు, మొండిబాకీల డిడక్షన్లకు సంబంధించిన ప్రొవిజన్ల కోసమూ టేబుల్స్ తయారు చేసింది. అంతేకాకుండా కొత్త చట్టంలో ‘ట్యాక్స్‌పేయర్స్ చార్టర్’ అనే సెక్షన్‌ను జోడించింది. ట్యాక్స్ పేయర్‌కు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి దీనిలో వివరించారు.