గవర్నర్‌ మార్పుపై కేంద్రం దృష్టి!

గవర్నర్‌ మార్పుపై కేంద్రం దృష్టి!

న్యూఢిల్లీ, వెలుగు:తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ మార్పుపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 2010 నుంచి గవర్నర్‌గా కొనసాగుతున్న ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌కు జాతీయ స్థాయిలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పజెప్పి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీకి బీజేపీ సీనియర్‌ లీడర్‌, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ను తెలంగాణకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ లేదా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీని నియమిస్తారని సోమవారం ఊహాగానాలు విన్పించాయి. అయితే ఈ వార్తలను సుష్మ ఖండించారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ కూడా ఓ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు అభినందనలు అంటూ ట్వీట్‌ చేసి ఆ వెంటనే దాన్ని డిలీట్‌ చేశారు. సుష్మను నియమిస్తున్నట్టు ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతోనే ఆయన ట్వీట్‌ చేసినట్టు తెలుస్తోంది.

అది అధికారిక సమాచారం కాదని తెలిసి డిలీట్‌ చేశారు. గవర్నర్ల నియామకంపై అధికారిక సమా చారం లేకున్నా నరసింహన్‌ను మారుస్తారన్న ఊహాగానాలు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా కొత్త హోంమంత్రి అమిత్‌ షాను ఆయన ప్రత్యేకంగా కలవడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. సీనియర్‌ ఐపీఎస్‌గా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా చాలా అనుభవం ఉన్న నరసింహన్‌ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాశ్మీర్‌ వ్యవహారాల్లో సీరియస్‌గా వ్యవహరించడంతోపాటు జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రానికి నరసింహన్‌ అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నరసింహన్‌ను మార్చాలని కేంద్రం నిర్ణయిస్తే.. తెలుగు రాష్ట్రాలకు ఎవరిని గవర్నర్లుగా నియమిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్ల పేర్లు బలంగా విన్పిస్తున్నాయి.

అమిత్‌ షాతో నరసింహన్‌ భేటీ

గవర్నర్‌ నరసింహన్‌ రెండ్రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన గవర్నర్… మర్యాదపూర్వకంగానే హోంమంత్రిని కలిసినట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను తెలంగాణకు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పుకుందన్నారు.