కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు మేం వ్యతిరేకం : తెలంగాణ వక్ఫ్​బోర్డ్​

కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు మేం వ్యతిరేకం : తెలంగాణ వక్ఫ్​బోర్డ్​

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకిస్తోందని బోర్డ్ ఛైర్మెన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేనీ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. 

వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల 6న పార్లమెంట్ లోని 34 మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు. కమిటీ తమ సూచనలను , అభ్యర్ధనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని... కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి , బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు.