 
                                    
- 
	ప్రజల ఏకైక గ్యారంటీ నరేంద్ర మోదీ
- 
	సెక్యూరిటీ లేకుండా ఓయూకి రాహుల్ రావాలె
- 
	కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
 
హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ శంషాబాద్‌లో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ  అవినీతి నుంచి బయట పడేందుకు కాంగ్రెస్‌కు... కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ నరేంద్ర మోదీ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా  మోదీ మాత్రమే గ్యారంటీ అంటున్నారని ఆయన చెప్పారు. 
సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యకర్తల గెలుపే రాష్ట్ర బీజేపీ నాయకత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకించారనటానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కార్యకర్తల పోరాటంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8సీట్లు వచ్చాయన్నారు. రైతులను మోసం చేసే విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్..

 
         
                     
                     
                    