గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై విస్తృతంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వీధి కుక్కల అంశంపై అన్ని రాష్ట్రాల నుంచి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం గురువారం ( జనవరి 29 ) తీర్పును రిజర్వ్ చేసింది. జంతు ప్రేమికులు, కుక్క కాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు సహా అందరి వాదనలను కోర్టు వివరంగా విన్న తర్వాత విచారణ ముగిసింది. అన్ని పార్టీలు తమ లిఖితపూర్వక వాదనలను వారంలోపు దాఖలు చేయాలని ఆదేశించింది కోర్టు.
బుధవారం ( జనవరి 28 ) చాలా రాష్ట్రాలు వీధి కుక్కలను స్టెరిలైజ్ చేయడం, కుక్కల పౌండ్లను ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలు, ఇతర సంస్థల ప్రాంగణాల నుంచి కుక్కలను తొలగించడం వంటి కీలక అంశాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పలు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలు కథలు చెప్పడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2024లో ఒకే ఒక డాగ్ సెంటర్ ఉన్నప్పటికీ 1.66 లక్షల కుక్క కాటు కేసులు నమోదైన అస్సాం డేటాపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది కోర్టు. 2025 జనవరిలోనే 20,900 మంది కుక్కలు కాటుకు గురయ్యారని, ఈ సంఖ్య ఆందోళనకరంగా ఉందని కోర్టు పేర్కొంది.
